Loading...
Abhishek Awasthi: ఆస్ట్రేలియా మేయర్ పీఠంపై భారతీయుడు.. ఎవరీ అభిషేక్ అవస్థి?
ఆస్ట్రేలియా మేయర్ పీఠంపై భారతీయుడు.. ఎవరీ అభిషేక్ అవస్థి?

Abhishek Awasthi: ఆస్ట్రేలియా మేయర్ పీఠంపై భారతీయుడు.. ఎవరీ అభిషేక్ అవస్థి?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 11, 2026
09:30 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియాలో భారత సంతతికి చెందిన అభిషేక్ అవస్థి అరుదైన ఘనత సాధించారు. విక్టోరియా రాష్ట్రంలోని గ్రేటర్ బెండిగో నగర మేయర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఆస్ట్రేలియాలో భారత సంతతి వలసదారుల్లో ఈ పదవిని చేపట్టిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు. నవంబర్ 9న జరిగిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో 2026-27 సంవత్సరానికి ఆయనను సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 43 ఏళ్ల అభిషేక్ గతంలో ఇదే నగరానికి డిప్యూటీ మేయర్‌గా పనిచేశారు.

వివరాలు 

ఏడాది పాటు మేయర్‌గా బాధ్యతలు

సోమవారం క్యాపిటల్ థియేటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అభిషేక్ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.

ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఆండ్రియా మెట్కాల్ఫ్ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు.

తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన కౌన్సిల్ సభ్యులకు, ప్రజలకు అభిషేక్ కృతజ్ఞతలు తెలిపారు.

గ్రేటర్ బెండిగోను తమ సొంత నివాసంగా మార్చుకున్న వలసదారులందరికీ ఈ విజయాన్ని అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.

తన జీవితంలో ఎదగడానికి తోడ్పడిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు.

వివరాలు 

ఫేస్‌బుక్‌లో భావోద్వేగ సందేశం

మేయర్‌గా ఎన్నికైన తర్వాత అభిషేక్ ఫేస్‌బుక్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ గౌరవం దక్కడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందని పేర్కొన్నారు.

తనపై విశ్వాసం ఉంచిన కౌన్సిల్ సభ్యులకు, ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన నగరవాసులకు ధన్యవాదాలు తెలిపారు.

నగర అభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేస్తానని చెప్పారు.

స్థానిక ప్రాంత ప్రయోజనాల కోసం గట్టిగా తన గొంతు వినిపిస్తానని, గ్రేటర్ బెండిగోకు ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.

ADVERTISEMENT

వివరాలు 

హిమాచల్ ప్రదేశ్ నుంచి ఆస్ట్రేలియాకు..

అభిషేక్ అవస్థి స్వస్థలం హిమాచల్ ప్రదేశ్‌లోని మండి. 2008లో ఉన్నత విద్య కోసం అంతర్జాతీయ విద్యార్థిగా ఆస్ట్రేలియాకు వెళ్లారు.

అక్కడ లా ట్రోబ్ యూనివర్సిటీలో బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్‌లో పోస్టుగ్రాడ్యుయేట్ విద్యను పూర్తి చేశారు.

అంతకుముందు ఉత్తరప్రదేశ్ టెక్నికల్ యూనివర్సిటీ నుంచి బీటెక్ పట్టా పొందారు. 2010లో బెండిగోలో స్థిరపడ్డారు.

అప్పటి నుంచి అక్కడి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, వివిధ సంస్కృతులకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

భారతీయ కుటుంబాలను ఒకే వేదికపైకి..

2021లో అభిషేక్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ బెండిగోను స్థాపించారు.

సెంట్రల్ విక్టోరియాలో నివసించే భారతీయ కుటుంబాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం.

భారతీయ సంస్కృతిని ప్రోత్సహించడంతో పాటు సేవా కార్యక్రమాలు,సామాజిక వేడుకలను నిర్వహించడంపై దృష్టి పెట్టారు.

2015లో ఆస్ట్రేలియా పౌరసత్వం పొందిన అభిషేక్ అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

రాజకీయ ప్రస్థానంలో వరుస విజయాలు

2024 నవంబర్‌లో కెనింగ్టన్ వార్డు కౌన్సిల్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో అభిషేక్ విజయం సాధించారు.

ఆ తర్వాత 2024-25సంవత్సరానికి గ్రేటర్ బెండిగో తొలి భారత సంతతి డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు.

అప్పటి మేయర్ ఆండ్రియా మెట్కాల్ఫ్‌తో కలిసి పనిచేశారు.తాజాగా మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై తన రాజకీయ ప్రస్థానంలో మరో కీలక మైలురాయిని అందుకున్నారు.

ADVERTISEMENT