Pm Modi -Trump: త్వరలో జరిగే జీ7 సదస్సులో మోదీ-ట్రంప్ భేటీ?
ఈ వార్తాకథనం ఏంటి
ఫ్రాన్స్‌లో జరగనున్న జీ7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య భేటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు, పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. జూన్ 15 నుంచి 17 వరకు ఫ్రాన్స్‌లోని ఎవియన్ లే బైన్స్‌లో జీ7 శిఖరాగ్ర సమావేశం నిర్వహించనున్నారు. భాగస్వామ్య దేశంగా భారత్‌కు ఈ సదస్సుకు ఆహ్వానం అందింది. ఈ సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటారని ఫ్రాన్స్ విదేశాంగ శాఖ వెల్లడించింది. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ సదస్సుకు హాజరవుతారని వైట్‌హౌస్ అధికారులను ఉటంకిస్తూ అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి.
వివరాలు
అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయని భారత్ , అమెరికా
ఈ నేపథ్యంలో జీ7 వేదికగా మోదీ, ట్రంప్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై భారత్ గానీ, అమెరికా గానీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేయడం, రక్షణ, వాణిజ్యం, సాంకేతికతతో పాటు ఇతర వ్యూహాత్మక రంగాల్లో సహకారాన్ని విస్తరించడం వంటి అంశాలపై ఈ భేటీలో చర్చలు జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
వివరాలు
అంతర్జాతీయంగా ఆసక్తికర పరిణామం
ఇదిలా ఉంటే, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు,అంతర్జాతీయ చమురు సరఫరాపై నెలకొన్న ఆందోళనలు, హర్మూజ్ జలసంధి దిగ్బంధనం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం మరింత కీలకంగా మారింది. కాగా, మోదీ-ట్రంప్ చివరిసారిగా 2025 ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా సమావేశమయ్యారు. ఆ తర్వాత వీరిద్దరూ ముఖాముఖిగా కలవలేదు. దీంతో జీ7 సదస్సు సందర్భంగా వీరి భేటీ జరిగితే అంతర్జాతీయంగా కూడా ఆసక్తికర పరిణామంగా మారే అవకాశం ఉంది.