Loading...
Pakistan: పాక్‌లో ఇక మునీర్‌దే హవా.. మూడు సేనలు ఆయన గుప్పిట్లోకి!
పాక్‌లో ఇక మునీర్‌దే హవా.. మూడు సేనలు ఆయన గుప్పిట్లోకి!

Pakistan: పాక్‌లో ఇక మునీర్‌దే హవా.. మూడు సేనలు ఆయన గుప్పిట్లోకి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 22, 2026
04:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లో సైన్యం మరింత బలోపేతం అవుతున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌ నేతృత్వంలో సైన్యం కీలక నిర్ణయాలపై ప్రభావం చూపుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. పాకిస్థాన్‌ తన సైనిక కమాండ్‌ వ్యవస్థలో కీలక మార్పులు చేసింది. ఆగస్టు 20న పాకిస్థాన్‌ పార్లమెంట్‌ 'డిఫెన్స్‌ ఫోర్సెస్‌ పాకిస్థాన్‌ యాక్ట్‌ 2026'తో పాటు నేషనల్‌ కమాండ్‌ అథారిటీ చట్టానికి సవరణలను ఆమోదించింది. దీంతో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లను ఫీల్డ్‌ మార్షల్‌ అసిమ్‌ మునీర్‌ నేతృత్వంలోని కేంద్రీకృత కమాండ్‌ వ్యవస్థ కిందకు తీసుకొచ్చింది.

వివరాలు

మూడు దళాలకు ఒకే కమాండ్

అసిమ్‌ మునీర్‌ ఇప్పటికే పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (CDF)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

జాతీయ భద్రత, రక్షణ, సాయుధ దళాలకు సంబంధించిన అంశాల్లో ప్రధానమంత్రికి ప్రధాన సైనిక సలహాదారుగా వ్యవహరించనున్నారు.

మూడు దళాలపై కార్యాచరణ కమాండ్‌, నియంత్రణ అధికారం కూడా ఆయన పరిధిలోకి రానుంది. కొత్త చట్టం ప్రకారం మునీర్‌ ఆధ్వర్యంలో డిఫెన్స్‌ ఫోర్సెస్‌ హెడ్‌క్వార్టర్స్‌ ఏర్పాటు కానుంది.

భూ, వాయు, సముద్ర, సైబర్‌, వ్యూహాత్మక రంగాల్లో సంయుక్త కార్యకలాపాలను సమన్వయం చేయడం దీని ప్రధాన ఉద్దేశం.

ఇప్పటివరకు ప్రత్యేక కమాండ్‌ వ్యవస్థల్లో పనిచేసిన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ ఇకపై ఒకే కమాండ్‌ కింద పనిచేయనున్నాయి.

వివరాలు

మునీర్‌కు మరిన్ని అధికారాలు

కొత్త చట్టంతో ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌ అధికారాలు మరింత పెరిగినట్లు తెలుస్తోంది.

సైనిక అధికారుల పదవీ విరమణ, తొలగింపు, రాజీనామాల ఆమోదం లేదా తిరస్కరణతో పాటు కొందరిని పదవుల్లో కొనసాగించే అంశాల్లోనూ ఆయనకు అధికారం లభించనుంది.

సైనిక నియామకాలు, ఉన్నత స్థాయి పదవులు, భవిష్యత్‌ సైనిక నాయకత్వంపై కూడా ఆయన ప్రభావం పెరగనుంది.

ADVERTISEMENT

వివరాలు

పాక్‌ సైనిక మార్పులపై భారత్‌ నిఘా

2025 మేలో ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం పాకిస్థాన్‌ తన సైనిక వ్యవస్థలో పలు మార్పులు చేస్తోంది. భవిష్యత్‌ యుద్ధాలు, సంక్షోభాల సమయంలో వాయు రక్షణ, క్షిపణి దళాలు, నౌకాదళం, సైబర్‌ విభాగం, భూతల దళాల మధ్య సమన్వయం పెంచుకోవడం ఈ మార్పుల ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

అయితే మూడు దళాలను ఒకే కమాండ్‌ కిందకు తీసుకురావడం మాత్రమే సైనిక సామర్థ్యాన్ని పెంచదని నిపుణుల అభిప్రాయం.

సమాచార వ్యవస్థలు, నిఘా సమన్వయం, సంయుక్త శిక్షణ, ఆధునిక సాంకేతికత, మూడు దళాల మధ్య సమర్థవంతమైన సమన్వయమే ఈ వ్యవస్థ విజయాన్ని నిర్ణయించనున్నాయి.

పాకిస్థాన్‌లో చోటుచేసుకుంటున్న ఈ సైనిక పరిణామాలను భారత్‌ నిశితంగా గమనిస్తోంది.

ADVERTISEMENT