Loading...
US-Russia: రష్యాలో ల్యాండ్‌ అయిన అమెరికా మిస్టరీ విమానం..  
రష్యాలో ల్యాండ్‌ అయిన అమెరికా మిస్టరీ విమానం..

US-Russia: రష్యాలో ల్యాండ్‌ అయిన అమెరికా మిస్టరీ విమానం..  

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 26, 2026
08:28 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉక్రెయిన్‌-రష్యా మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం కొనసాగుతున్న సమయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన ఓ సైనిక రవాణా విమానం మంగళవారం రష్యాలోని మాస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయింది. దీంతో అసలు ఆ విమానం రష్యాకు ఎందుకు వెళ్లిందనే అంశంపై సోషల్‌ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఫ్లైట్‌రాడార్‌ 24 వెల్లడించిన సమాచారం ప్రకారం.. బోయింగ్‌ సీ-17 గ్లోబ్‌మాస్టర్‌ 3 విమానం లాత్వియా రాజధాని రిగా నుంచి స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.50గంటలకు బయల్దేరింది. అనంతరం ఉదయం 10గంటలు దాటిన తర్వాత మాస్కోలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. అంతకుముందు ఆగస్టు 23న ఈ విమానం అమెరికాలోని వాషింగ్టన్‌ సమీపంలోని ఆండ్రూస్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌ నుంచి రిగాకు చేరుకున్నట్లు సమాచారం.

వివరాలు 

ఈ విమానంలో సైనిక సిబ్బందితో పాటు ఆయుధాలు,రక్షణ పరికరాలు,కార్గో

సీ-17 గ్లోబ్‌మాస్టర్‌ 3 సాధారణ ప్రయాణికుల విమానం కాదు. ఇది అమెరికా వాయుసేనకు చెందిన సైనిక రవాణా విమానం.

సుదీర్ఘ దూర ప్రయాణాల కోసం దీన్ని వినియోగిస్తారు. సైనిక సిబ్బందితో పాటు ఆయుధాలు, రక్షణ పరికరాలు, ఇతర కార్గోను తరలించేందుకు ఈ విమానాన్ని ఉపయోగిస్తుంటారు.

ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం తీవ్రంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇలాంటి అమెరికా సైనిక విమానం మాస్కోలో ల్యాండ్‌ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

విమానం రాక వెనుక అసలు కారణం ఏమిటి? అందులో ఎవరు ఉన్నారు? ఏదైనా ప్రత్యేకమైన సామగ్రిని తరలించారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అయితే వీటికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు.

వివరాలు 

స్పందించని అమెరికా 

విమానం రష్యాకు వెళ్లడంపై అమెరికా ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు.

మరోవైపు, అమెరికా సైనిక విమానం మాస్కోలో ల్యాండ్‌ అయిన విషయం తమకు తెలియదని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్‌ స్పష్టం చేసినట్లు సమాచారం.

దీంతో ఈ వ్యవహారంపై మరింత ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా.. అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ రష్యాలో పర్యటించే అవకాశం ఉందంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే అమెరికా సైనిక రవాణా విమానం మాస్కోకు చేరుకోవడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అయితే విమానం రాకకు, హెగ్సెత్‌ పర్యటనకు ఏమైనా సంబంధం ఉందా అనే దానిపై మాత్రం ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు.

ADVERTISEMENT

వివరాలు 

సోషల్‌ మీడియాలో వైరల్‌గా సీ-17 గ్లోబ్‌మాస్టర్‌ 3

మరోవైపు, మాస్కో విమానాశ్రయంలో అమెరికా సీ-17 గ్లోబ్‌మాస్టర్‌ 3 ల్యాండ్‌ అయిన దృశ్యాలకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

యుద్ధ వాతావరణం కొనసాగుతున్న సమయంలో అమెరికా సైనిక విమానం రష్యాలో అడుగుపెట్టడం చర్చనీయాంశంగా మారింది.

ADVERTISEMENT