Sergio Gor: చంద్రుడిపై మూన్ బేస్.. ఇస్రోను ఆహ్వానించిన నాసా
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా చంద్రుడిపై చేపట్టనున్న భవిష్యత్ కార్యక్రమాల్లో భారత్‌ను కూడా భాగస్వామిగా చేసుకోవాలని చూస్తోంది. నాసా చేపట్టనున్న 'మూన్ బేస్' కార్యక్రమంలో చేరాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)ను అధికారికంగా ఆహ్వానించినట్లు భారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్ తెలిపారు. బెంగళూరులో జరుగుతున్న స్పేస్ ఎక్స్‌పో 2026లో ఆయన మాట్లాడారు. అమెరికా మళ్లీ చంద్రుడిపైకి వెళ్లేందుకు సిద్ధమవుతోందని, ఈ ప్రయాణంలో భారత్ తమతో కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. భారత్ ఇప్పటికే ఆర్టెమిస్ ఒప్పందాలపై సంతకం చేసిన దేశాల్లో ఒకటని ఆయన గుర్తుచేశారు.
వివరాలు
భూకంప సమయంలో నిసార్ రాడార్ డేటా కీలకం
ఆర్టెమిస్ కార్యక్రమంలో భాగంగా నాసా వ్యోమగాములను దశలవారీగా మరింత క్లిష్టమైన చంద్రుడి అన్వేషణ మిషన్లకు పంపనుంది.
చంద్రుడిపై శాస్త్రీయ పరిశోధనలు, ఆర్థిక అవకాశాలను పెంచడంతో పాటు భవిష్యత్తులో అంగారకుడిపై మానవులను పంపే మిషన్లకు అవసరమైన పునాదిని ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
భారత్-అమెరికా అంతరిక్ష సహకారాన్నిప్రస్తావించిన గోర్.. నిసార్ (NISAR)మిషన్ రెండు దేశాల సంయుక్త సాంకేతిక సామర్థ్యానికి మంచి ఉదాహరణగా నిలిచిందన్నారు.
ఇది కేవలం శాస్త్రీయ పరిశోధనకు మాత్రమే పరిమితం కాలేదని,విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగపడుతోందని చెప్పారు.
రెండు నెలల క్రితం వెనిజులాలో భారీ భూకంపం సంభవించినప్పుడు నిసార్ రాడార్ డేటా మేఘాలు, దుమ్ము వంటి వాటిని దాటి భూకంపం ప్రభావిత ప్రాంతాలను గుర్తించడంలో సహాయపడిందని తెలిపారు.
వివరాలు
శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రతో భారత్-అమెరికా బంధం మరింత బలోపేతం
దీంతో అత్యవసర సిబ్బంది సహాయక చర్యలను వేగంగా చేపట్టగలిగారని వివరించారు.
మానవ సహిత అంతరిక్ష ప్రయాణంలోనూ భారత్ కీలకంగా ఎదుగుతోందని గోర్ అన్నారు.
గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
అమెరికా భాగస్వామ్యంతో జరిగిన ఈ ప్రయాణం భారత్‌కు ఒక కీలక మైలురాయిగా నిలిచిందన్నారు.
ఆక్సియం-4 మిషన్, ఐదు సంయుక్త శాస్త్రీయ పరిశోధనల తర్వాత ఇరు దేశాలు అంతరిక్ష నౌకల డాకింగ్ ప్రమాణాలు, పరస్పర అనుసంధాన సామర్థ్యం, వ్యోమగాముల శిక్షణ వంటి అంశాల్లో మరింత సహకారంపై దృష్టి సారిస్తున్నాయని తెలిపారు.
వివరాలు
అమెరికా మార్కెట్‌లో భారత స్పేస్ స్టార్టప్‌లకు అవకాశాలు
భారత అంతరిక్ష స్టార్టప్‌లకు అమెరికా మార్కెట్‌లో మరిన్ని అవకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని గోర్ చెప్పారు.
పిక్సెల్, గెలాక్సీఐ, డిజాంతర, బెల్లాట్రిక్స్, స్కైరూట్, అగ్నికుల్ వంటి భారత అంతరిక్ష సంస్థలు మంచి సామర్థ్యాన్ని చూపుతున్నాయని పేర్కొన్నారు.
భారత అంతరిక్ష రంగ పారిశ్రామికవేత్తలకు అమెరికా మార్కెట్ అందుబాటులో ఉందని, అమెరికా పెట్టుబడిదారులు భారత స్టార్టప్‌లపై ఆసక్తి చూపుతున్నారని చెప్పారు.
ఈ సంస్థలు అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి అవసరమైన సహకారం అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందన్నారు.
అంతరిక్ష రంగంలో పాలన, నియంత్రణకు సంబంధించిన అంశాల్లోనూ భారత్, అమెరికా కలిసి పనిచేస్తున్నాయని గోర్ తెలిపారు.
వివరాలు
అంతరిక్ష రంగంలో భారత్-అమెరికా జోరు.. చంద్రుడిపై కలిసి అడుగులు
అంతరిక్ష రవాణా సమన్వయం నుంచి షాంఘైలో జరగనున్న వరల్డ్ రేడియోకమ్యూనికేషన్ కాన్ఫరెన్స్ వరకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు.
అంతరిక్ష కార్యకలాపాలు పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా కొనసాగేలా ప్రపంచస్థాయిలో ప్రమాణాలను రూపొందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
అంతరిక్ష రంగంలో భారత్-అమెరికా భాగస్వామ్యం మరింత విస్తరిస్తే దాని ప్రభావం గుణాత్మకంగా పెరుగుతుందని గోర్ అన్నారు.
రెండు దేశాలు కలిసి పనిచేసినప్పుడు ఫలితం కేవలం కూడికలా కాకుండా గుణకారంలా ఉంటుందని వ్యాఖ్యానించారు.
బెంగళూరు నుంచి అంతరిక్షం వైపు చూస్తూ ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను నిర్మించేందుకు కలిసి పనిచేద్దామని, చంద్రుడిపైకి కూడా కలిసి తిరిగి వెళ్దామని ఆయన పిలుపునిచ్చారు.