Loading...
Naval drones sink: బల్గేరియా తీరంలో సముద్ర డ్రోన్ల విధ్వంసం.. మునిగిన భారీ ఓడ
బల్గేరియా తీరంలో సముద్ర డ్రోన్ల విధ్వంసం.. మునిగిన భారీ ఓడ

Naval drones sink: బల్గేరియా తీరంలో సముద్ర డ్రోన్ల విధ్వంసం.. మునిగిన భారీ ఓడ

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2026
09:29 am

ఈ వార్తాకథనం ఏంటి

నల్ల సముద్రంలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా సముద్ర డ్రోన్ల దాడిలో లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న ఓ భారీ సరుకు నౌక సముద్రంలో మునిగిపోయింది. బల్గేరియా తీరానికి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తీరానికి సుమారు 21 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న 'కాంట్‌షిప్ జెట్' అనే నౌకను మూడు సముద్ర డ్రోన్లు ఢీకొన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. గ్రీకు సంస్థకు చెందిన ఈ నౌక ఇజ్రాయెల్‌లోని హైఫా నౌకాశ్రయం నుంచి రొమేనియాలోని కొన్‌స్టానా పోర్టుకు సరుకును తీసుకెళ్తుండగా దాడి జరిగింది.

వివరాలు 

నౌకలో మొత్తం 18 మంది సిబ్బంది

ఈ నౌకలో మొత్తం 18 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 14 మంది ఫిలిప్పీన్స్‌కు చెందినవారు కాగా, మరో నలుగురు ఉక్రెయిన్‌కు చెందినవారు.

దాడి జరిగిన వెంటనే బల్గేరియా నేవీ రంగంలోకి దిగి సిబ్బందిని సురక్షితంగా రక్షించింది. అనంతరం వారిని తీర ప్రాంత నగరమైన వర్నాకు తరలించింది.

కాగా, ఈ నౌకలో ప్రమాదకరమైన సరుకు ఉన్నట్లు సమాచారం. లిథియం అయాన్ బ్యాటరీలు, సులభంగా మండే రసాయనాలు, ఇతర ప్రమాదకర పదార్థాలతో నిండిన మొత్తం 421 కంటెయినర్లు అందులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

వివరాలు 

దాడి గురించి ముందే సమాచారం.. అయినా అడ్డుకోలేకపోయారు!

నౌకపై దాడి జరగబోతున్నట్లు తమకు ముందుగానే సమాచారం అందిందని బల్గేరియా ప్రభుత్వం వెల్లడించింది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఈ ఘటనతో సంబంధం ఉండొచ్చని అనుమానిస్తున్నప్పటికీ, దాడిని అడ్డుకోవడంలో విఫలమయ్యామని తెలిపింది.

బల్గేరియాకు చెందిన ఓ వార్తా వెబ్‌సైట్ విడుదల చేసిన వీడియోలో సముద్ర డ్రోన్ నౌక వైపు వేగంగా దూసుకెళ్లి ఢీకొట్టిన దృశ్యాలు కనిపించాయి.

ఈ దాడి కారణంగా నౌక తీవ్రంగా దెబ్బతిని చివరకు సముద్రంలో మునిగిపోయింది.

ADVERTISEMENT

వివరాలు 

దాడి వెనుక ఎవరున్నారు?

ఈ దాడికి పాల్పడినవారు ఎవరన్నది ఇప్పటివరకు స్పష్టత రాలేదు.

నౌకకు ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్నప్పటికీ, ఆ కారణంతోనే దానిని లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రాథమిక అంచనాల్లో కనిపించడం లేదని సమాచారం.

అయితే అసలు దాడి వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? ఎవరు దీనికి పాల్పడ్డారు? అనే విషయాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.

ఈ ఘటనతో నల్ల సముద్రం పశ్చిమ ప్రాంతంలో వాణిజ్య నౌకలకు భద్రత లేకుండా పోతోందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

ఈ నెలలోనే ఆరు నౌకలపై దాడులు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో గగనతల డ్రోన్లు, సముద్ర డ్రోన్లతో దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

ఈ నెలలోనే బల్గేరియా తీరానికి సమీపంలో కనీసం ఆరు నౌకలపై వైమానిక లేదా సముద్ర డ్రోన్లతో దాడులు జరిగినట్లు పలు నివేదికలు వెల్లడించాయి.

ఈ ఘటనల్లో దాదాపు 25 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. యుద్ధం ప్రభావం కేవలం రష్యా, ఉక్రెయిన్ మధ్య ప్రత్యక్ష పోరాట ప్రాంతాలకే పరిమితం కావడం లేదు.

అంతర్జాతీయ వాణిజ్య మార్గాలపైనా దాని ప్రభావం పడుతుండటంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ADVERTISEMENT