Nepal Floods: జల విలయంతో అతలాకుతలం.. 300 మంది భారతీయులు మిస్సింగ్: నేపాల్ మంత్రి
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్‌లో భారీ వరదలు, జల విలయం తీవ్ర బీభత్సం సృష్టించాయి. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే గ్రామాలకు గ్రామాలు కొట్టుకుపోయాయని ఆ దేశ విదేశాంగ మంత్రి శిశిర్ ఖానల్ తెలిపారు. గురువారం సంభవించిన వరదల్లో ఇప్పటివరకు 160 మంది మృతిచెందినట్లు ఆయన ధ్రువీకరించారు. ఈ మేరకు ఎన్డీటీవీతో మాట్లాడిన ఆయన.. పరిస్థితి తీవ్రతను వివరించారు. రసువా ప్రాంతంలో వేలాది మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని ఖానల్ వెల్లడించారు. భారీ వరదల కారణంగా వేల సంఖ్యలో కుటుంబాలు ఇళ్లు కోల్పోయాయని, అనేక మంది గల్లంతయ్యారని చెప్పారు. జల విలయం కారణంగా జరిగిన మొత్తం నష్టాన్ని ప్రస్తుతం అంచనా వేస్తున్నామని తెలిపారు.
వివరాలు
భారతీయ పర్యాటకులపై తీవ్ర ప్రభావం
మానస సరోవర్ యాత్ర కోసం నేపాల్‌కు వచ్చిన భారతీయ పర్యాటకులు ఈ విపత్తులో ఎక్కువగా ప్రభావితమైనట్లు నేపాల్ విదేశాంగ మంత్రి చెప్పారు.
సుమారు 300 మంది భారతీయులు గల్లంతైన వారి జాబితాలో ఉన్నట్లు వెల్లడించారు.
విదేశీ పర్యాటకులతో పాటు భారతీయులు కూడా వరదలు సంభవించిన మార్గం మీదుగానే మానస సరోవర్ యాత్రకు వెళ్తుంటారని ఖానల్ వివరించారు.
ప్రస్తుతం గల్లంతైన సుమారు 300 మంది భారతీయులను సంప్రదించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
వివరాలు
ఎంబసీలతో నిరంతరం సంప్రదింపులు
నేపాల్‌లో ఉన్న విదేశీ పర్యాటకుల క్షేమ సమాచారాన్ని తెలుసుకునేందుకు ఆయా దేశాల రాయబార కార్యాలయాలతో తమ ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని ఖానల్ తెలిపారు.
విదేశీ పర్యాటకుల భద్రతకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంతో పాటు, గల్లంతైన వారిని గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు.
ఇటీవలి కాలంలో నేపాల్ ఎదుర్కొన్న అత్యంత దారుణమైన విపత్తు ఇదేనని శిశిర్ ఖానల్ పేర్కొన్నారు.
వరదల కారణంగా ఏర్పడిన పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రస్తుతం ప్రభుత్వం ప్రధానంగా సహాయక, రక్షణ చర్యలపైనే దృష్టి సారించిందన్నారు.
వివరాలు
భారత్‌కు కృతజ్ఞతలు
విపత్తు సమయంలో భారత్ అందిస్తున్న సహాయానికి నేపాల్ విదేశాంగ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుతం తమ ప్రధాన ప్రాధాన్యత రెస్క్యూ, రిలీఫ్ చర్యలేనని స్పష్టం చేశారు.
గల్లంతైన వారిని గుర్తించడం, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వారికి అవసరమైన సహాయం అందించడంపై దృష్టి పెట్టినట్లు ఖానల్ వెల్లడించారు.