LOADING...
Sardar Aman Khan: పీఓకేలో ఆహారం, మందుల కొరత.. భారత సాయం కోరిన జేఏఏసీ నేత
పీఓకేలో ఆహారం, మందుల కొరత.. భారత సాయం కోరిన జేఏఏసీ నేత

Sardar Aman Khan: పీఓకేలో ఆహారం, మందుల కొరత.. భారత సాయం కోరిన జేఏఏసీ నేత

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 06, 2026
11:15 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జాయింట్‌ అవామీ యాక్షన్‌ కమిటీ (జేఏఏసీ) నాయకుడు సర్దార్‌ అమన్‌ ఖాన్‌ భారత్‌ను మానవతా దృష్టితో సాయం చేయాలని కోరారు. పాకిస్థాన్‌ ప్రభుత్వం ఆర్థిక దిగ్బంధం విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు. రేషన్‌, మందులు వంటి అత్యవసర వస్తువుల కొరత తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఒక వీడియోలో అమన్‌ ఖాన్‌ మాట్లాడుతూ, పీఓకే ప్రజలకు ప్రస్తుతం భారత సాయం అత్యంత అవసరమని అన్నారు.

వివరాలు 

ఎల్‌ఓసీ వైపు వెళ్లాలా?

రేషన్‌, మందుల సరఫరా నిలిచిపోయిందని, మానవతా కోణంలో భారత్‌ స్పందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వద్ద సరిహద్దును తెరిచి, అవసరమైతే ప్రజలు భారత్‌కు వచ్చేందుకు అవకాశం కల్పించాలని కోరారు. పరిస్థితులు మరింత విషమిస్తే ప్రజలకు రక్షణ కల్పించే చర్యలు తీసుకోవాలని సూచించారు. రావల్‌కోట్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో అమన్‌ ఖాన్‌ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా "ఎల్‌ఓసీ వైపు వెళ్లాలా?" అని ఆయన ప్రశ్నించగా, సభకు హాజరైన ప్రజలు "వెళ్దాం" అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రజల న్యాయమైన డిమాండ్లకు తూటాలతో సమాధానం ఇస్తే తమ వద్ద ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయని ఆయన హెచ్చరించారు.

వివరాలు 

పాకిస్థాన్‌ నుంచి స్వాతంత్ర్యం కోరే దిశగా ఉద్యమం

గత నెల రోజులుగా పీఓకేలో పాకిస్థాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. తొలుత సంస్కరణలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రారంభమైన ఈ ఉద్యమం, ప్రస్తుతం పాకిస్థాన్‌ నుంచి స్వాతంత్ర్యం కోరే దిశగా మారిందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement