Loading...
Nepal Compensation: 'ఇది దాతృత్వం కాదు.. బాధ్యత'.. భారత్,చైనా, అమెరికాలను పరిహారం చెల్లించాలని అంతర్జాతీయంగా కోరుతున్న నేపాల్..
'ఇది దాతృత్వం కాదు.. బాధ్యత'..

Nepal Compensation: 'ఇది దాతృత్వం కాదు.. బాధ్యత'.. భారత్,చైనా, అమెరికాలను పరిహారం చెల్లించాలని అంతర్జాతీయంగా కోరుతున్న నేపాల్..

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 02, 2026
04:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్‌లో భారీ వరదలు పెను విషాదాన్ని మిగిల్చాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు 1,127 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 3,900 మంది ఆచూకీ తెలియకుండా పోయారు. భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది. అయితే ఈ విపత్తును నేపాల్ ప్రభుత్వం ఇప్పుడు అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్తోంది. వరదల కారణంగా ఎదురైన నష్టానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. వాతావరణ మార్పులకు దారితీస్తున్న గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాల కారణంగానే ఇలాంటి విపత్తులు తీవ్రతరం అవుతున్నాయని నేపాల్ వాదిస్తోంది. ప్రపంచంలో అధిక స్థాయిలో కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్న దేశాల్లో భారత్, చైనా, అమెరికాలు ఉన్నాయని పేర్కొంటూ.. తమ దేశానికి జరిగిన నష్టానికి 'క్లైమేట్ కాంపెన్సేషన్' అందించాలని కోరుతోంది.

వివరాలు 

వాతావరణ మార్పులపై నేపాల్ ఆందోళన

ఆగస్టు 26న భోటేకోషి నదీ పరివాహక ప్రాంతంలో భారీ వరదలు సంభవించాయి.

దీంతో రసువా,నువాకోట్,ధాదింగ్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

వరద ఉద్ధృతికి అనేక ఇళ్లు,రహదారులు, వంతెనలు ధ్వంసమయ్యాయి.

పలు జలవిద్యుత్ ప్రాజెక్టులు కూడా దెబ్బతిన్నాయి. ఈ విపత్తు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నేపాల్ ప్రభుత్వం దీనిని 'హిమాలయన్ సునామీ'గా అభివర్ణించింది.

నేపాల్, చైనా సరిహద్దులకు సమీపంలోని ప్రాంతాల్లో కొండచరియలు, భారీగా రాళ్లు విరిగిపడటం వల్ల వరదలు సంభవించి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

అయితే ఈ ఘటనను కేవలం ప్రకృతి విపత్తుగా మాత్రమే చూడకూడదని నేపాల్ చెబుతోంది.

వాతావరణ మార్పుల ప్రభావం, దానికి కారణమవుతున్న కర్బన ఉద్గారాలు, వాటి వల్ల ఎక్కువగా నష్టపోతున్న దేశాలకు పరిహారం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతోంది.

వివరాలు 

ఇది దాతృత్వం కాదు.. వాతావరణ నష్టానికి పరిహారం ఇవ్వాల్సిందే

వాతావరణ మార్పుల కారణంగా తీవ్రంగా నష్టపోతున్న దేశాలకు అధిక స్థాయిలో కర్బన ఉద్గారాలు విడుదల చేసే దేశాలు పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉందని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ పేర్కొన్నారు.

వరదల వల్ల ఏర్పడిన నష్టాన్ని కేవలం మానవతా సంక్షోభంగా చూడకుండా.. వాతావరణ న్యాయం, నష్టపరిహారం అనే కోణంలోనూ చూడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

తమకు కావాల్సింది దాతృత్వం కాదని నేపాల్ స్పష్టం చేస్తోంది.

వాతావరణ మార్పుల వల్ల తలెత్తుతున్న నష్టాలకు సంబంధించి అభివృద్ధి చెందిన, అధిక ఉద్గారాలు విడుదల చేస్తున్న దేశాలకు చట్టపరమైన, నైతిక బాధ్యత ఉందని అంతర్జాతీయ స్థాయిలో తన వాదనను వినిపిస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

యూఎన్‌ వేదికగా పరిహారం కోసం ప్రయత్నాలు

ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలను అధికంగా విడుదల చేస్తున్న దేశాల్లో చైనా,అమెరికా, భారత్ అగ్రస్థానాల్లో ఉన్నాయని నేపాల్ పేర్కొంటోంది.

అయితే తలసరి కర్బన ఉద్గారాల విషయానికి వస్తే.. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్ స్థాయి చాలా తక్కువగా ఉందన్న అంశం కూడా ఉంది.

ఇదిలా ఉండగా.. వరదల కారణంగా తమ దేశానికి జరిగిన నష్టంపై అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించేందుకు నేపాల్ ప్రధాని బాలెన్ షా ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది.

వరదల వల్ల జరిగిన నష్టం,బాధితుల పునరావాసం,దెబ్బతిన్న ప్రాంతాల పునర్నిర్మాణం కోసం నేపాల్ ఇప్పటికే ఐక్యరాజ్యసమితి మద్దతుతో పనిచేస్తున్న 'ఫండ్ ఫర్ రెస్పాండింగ్ టు లాస్ అండ్ డ్యామేజ్'కు అధికారికంగా అభ్యర్థన పంపింది.

ADVERTISEMENT