LOADING...
Nepal PM: నేపాల్ ప్రధానికి వ్యతిరేకంగా నిరసనలు.. రాజీనామా చేయాలంటూ డిమాండ్..!
నేపాల్ ప్రధానికి వ్యతిరేకంగా నిరసనలు.. రాజీనామా చేయాలంటూ డిమాండ్..!

Nepal PM: నేపాల్ ప్రధానికి వ్యతిరేకంగా నిరసనలు.. రాజీనామా చేయాలంటూ డిమాండ్..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 03, 2026
03:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-నేపాల్ సరిహద్దు వివాదంపై నేపాల్ ప్రధాని బాలేంద్ర షా (బాలేన్ షా) చేసిన వ్యాఖ్యలు ఆ దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలకు సంబంధించిన సరిహద్దు వివాదం కొనసాగుతున్న సమయంలో, కేవలం భారత్ మాత్రమే కాకుండా నేపాల్ కూడా కొన్ని ప్రాంతాల్లో భారత భూభాగాన్ని ఆక్రమించిందని ప్రధాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగగా, ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు ఖాట్మండు వీధుల్లో ఆందోళనలు నిర్వహిస్తూ ప్రధాని తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

వివరాలు 

పార్లమెంట్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు

మే 31న జరిగిన పార్లమెంట్ సమావేశంలో మాట్లాడిన బాలేన్ షా, తాను అధికారంలోకి వచ్చిన తర్వాతే సరిహద్దు సమస్యల వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నానని తెలిపారు. భారత్ మాత్రమే కాకుండా నేపాల్ కూడా పలు ప్రాంతాల్లో భారత భూభాగాన్ని ఆక్రమించిందని ఆయన పేర్కొన్నారు. ఈ సుదీర్ఘ వివాదానికి పరిష్కారం కోసం చరిత్రకారులు, సర్వే నిపుణులతో కూడిన ఉమ్మడి బృందాలను ఏర్పాటు చేసి దౌత్యపరమైన చర్చలు జరపాలని సూచించారు. 1816లో కుదిరిన సుగౌలీ ఒప్పందం కాలం నుంచి కొనసాగుతున్న ఈ సమస్యపై భారత్, చైనా మాత్రమే కాకుండా బ్రిటన్ ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

వివరాలు 

డ్యామేజ్ కంట్రోల్‌లో విదేశాంగ శాఖ

ప్రధాని వ్యాఖ్యలతో పార్లమెంట్‌లో తీవ్ర గందరగోళం నెలకొనడంతో నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. ప్రధాని ప్రస్తావించిన "ఆక్రమణలు" అనే పదం కాలాపానీ, లిపులేఖ్ వంటి ప్రధాన వివాదాస్పద ప్రాంతాలకు సంబంధించిందికాదని స్పష్టం చేసింది. నదుల ప్రవాహ మార్పుల కారణంగా సరిహద్దుల వద్ద ఉన్న 'నో మ్యాన్స్ ల్యాండ్' (దస్గజా) ప్రాంతాల్లో ఇరు దేశాల ప్రజలు సాగు చేసుకుంటూ సరిహద్దులు దాటిన సందర్భాలనే ప్రధాని ఉద్దేశించారని పేర్కొంది.

Advertisement

వివరాలు 

మళ్లీ వేడెక్కిన సరిహద్దు వివాదం

లిపులేఖ్ పాస్ మార్గం ద్వారా కైలాశ్ మానససరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించేందుకు భారత్, చైనా చర్యలు చేపట్టడంతో ఈ ఏడాది మే నెలలోనే ఇరు దేశాల మధ్య సరిహద్దు అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో ప్రధాని వ్యాఖ్యలు వెలువడటంతో వివాదం మరింత ముదిరింది.

Advertisement

వివరాలు 

అధికారంలోకి తెచ్చిన ఉద్యమాలే ఇప్పుడు సవాల్

2025లో యువత నేతృత్వంలో సాగిన అవినీతి వ్యతిరేక ఉద్యమాల నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన బాలేన్ షా నేతృత్వంలోని 'రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ' ప్రస్తుతం అదే తరహా ప్రజా నిరసనలను ఎదుర్కొంటోంది. ప్రధాని వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పెరుగుతున్న వ్యతిరేకత ఆయన ప్రభుత్వానికి కొత్త రాజకీయ సవాలుగా మారింది.

Advertisement