PM Modi, Netanyahu: మోదీతో నెతన్యాహు ఫోన్ సంభాషణ.. ఇజ్రాయెల్‌కు రావాలని ఆహ్వానం
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్-ఇజ్రాయెల్ ద్వైపాక్షిక సంబంధాల్లో సాధించిన పురోగతిని సమీక్షించారు. ఇజ్రాయెల్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌తో కలిసి పాల్గొనేందుకు తమ దేశానికి రావాలని ప్రధాని మోదీని నెతన్యాహు ఆహ్వానించారు. ఈ విషయాన్ని ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.
వివరాలు
స్మిత్ 'ప్రపంచానికి హీరో
'నా మిత్రుడు, భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడాను. ఇజ్రాయెల్‌కు రావాలంటూ తాను ఇచ్చిన ఆహ్వానానికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాద నిర్మూలన కోసం భారత్, ఇజ్రాయెల్ నిరంతరం కృషి చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఇరు దేశాల మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న బలమైన స్నేహ సంబంధాలపై సంతోషం వ్యక్తం చేశారు' అని నెతన్యాహు పేర్కొన్నారు.
ఫ్లైదుబాయ్ విమానంలో సహ పైలట్ దాడి కారణంగా స్పృహ కోల్పోయే పరిస్థితి ఎదురైనప్పటికీ, ప్రయాణికులను కాపాడిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌ను నెతన్యాహు గతంలో ప్రశంసించారు.
స్మిత్‌ను 'ప్రపంచానికి హీరో'గా అభివర్ణించారు.
వివరాలు
పశ్చిమాసియాపై చర్చలు
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తనకు ఫోన్ చేసి మాట్లాడినట్లు ప్రధాని మోదీ కూడా 'ఎక్స్' ద్వారా వెల్లడించారు.
భారత్-ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరంపై తామిద్దరం ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు.
ఇరు దేశాల ప్రధానులు పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై చర్చించుకున్నారని ప్రధాన మంత్రి కార్యాలయం దిల్లీలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ఆ ప్రాంతంలో తక్షణమే శాంతి, సుస్థిరత నెలకొనాల్సిన అవసరాన్ని నేతలిద్దరూ నొక్కిచెప్పినట్లు వివరించింది.
సమస్యలను చర్చలు, దౌత్యమార్గాల ద్వారా పరిష్కరించుకోవాలన్నది భారతదేశ వైఖరని ప్రధాని మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది.