H-1B fee:హెచ్-1బీ వీసాలో మరోసారి మార్పులు.. ఫీజుల పెంపుపై వైట్‌హౌస్ సమీక్ష
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలసల నియంత్రణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగా హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. విదేశీయులు అమెరికాకు వచ్చే అవకాశాలను తగ్గించే ఉద్దేశంతో వీసా ఫీజులను పెంచడంతో పాటు పలు నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తాజాగా హెచ్-1బీ వీసా ఫీజులను మరోసారి పెంచే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనపై వైట్‌హౌస్‌లోని ఆఫీస్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ (ఓఐఆర్ఏ) సమీక్ష పూర్తయినట్టు సమాచారం. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) ఈ ఫీజుల పెంపు ప్రతిపాదనను తీసుకొచ్చింది.
వివరాలు
ఫీజులను ఎంత మేర పెంచనున్నారు?
అయితే, ప్రతిపాదనకు సంబంధించిన పూర్తి వివరాలను ట్రంప్ ప్రభుత్వం ఇప్పటివరకు వెల్లడించలేదు.
ఫీజులను ఎంత మేర పెంచనున్నారు? ఏ రకమైన హెచ్-1బీ వీసా పిటిషన్లకు ఈ పెంపు వర్తిస్తుంది? అనే అంశాలపై స్పష్టత లేదు.
రాబోయే వారాల్లో డీహెచ్‌ఎస్ ఈ ప్రతిపాదనను అధికారికంగా ప్రజల ముందుకు తీసుకురానున్నట్టు తెలుస్తోంది.
అనంతరం ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తారు. వాటిని పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
వివరాలు
హెచ్-1బీ వీసా ఫీజుల పెంపు విషయంలో కోర్టులో ఎదురుదెబ్బలు
అయితే ఓఐఆర్ఏ సమీక్ష పూర్తయిందంటే ఫీజుల పెంపునకు తుది అనుమతి లభించినట్టు కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ప్రతిపాదనను ప్రజల అభిప్రాయాల కోసం విడుదల చేసిన తర్వాత వచ్చే సూచనలు, అభ్యంతరాలను డీహెచ్‌ఎస్ పరిశీలించాల్సి ఉంటుంది.
ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఫీజుల పెంపుపై తుది నిర్ణయం తీసుకుంటారు.
ఇప్పటికే హెచ్-1బీ వీసా ఫీజుల పెంపు విషయంలో కోర్టులో ఎదురుదెబ్బలు తగిలినా ట్రంప్ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు.
ఇటీవల 9-11 రెస్పాన్స్, బయోమెట్రిక్ ఫీజులను కూడా పెంచింది. హెచ్-1బీ, ఎల్-1 వీసాల పొడిగింపు కోసం దరఖాస్తు చేసే కొన్ని సంస్థలపై ఈ అదనపు ఆర్థిక భారాన్ని మోపింది.
వివరాలు
2025 ఆర్థిక సంవత్సరంలో 4,06,348 హెచ్-1బీ వీసా పిటిషన్ల ఆమోదం
ఇదే సమయంలో హెచ్-1బీ వీసా విధానంలో మరిన్ని మార్పులు తీసుకురావాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
ముఖ్యంగా హెచ్-1బీ వీసాలకు స్పాన్సర్ చేసే సంస్థలపై పర్యవేక్షణను మరింత కఠినతరం చేసే చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం.
2025 ఆర్థిక సంవత్సరంలో అమెరికా ప్రభుత్వం మొత్తం 4,06,348 హెచ్-1బీ వీసా పిటిషన్లను ఆమోదించింది.
వీటిలో 2,91,542 పిటిషన్లు వీసా పొడిగింపులకు సంబంధించినవే. ఆమోదం పొందిన పిటిషన్లలో భారతీయుల వాటా ఏకంగా 77.6 శాతంగా ఉంది.
వివరాలు
భారతీయ ఉద్యోగులు అధికంగా పనిచేస్తున్న టెక్నాలజీ కంపెనీలపై ఆర్థిక భారం
ఈ నేపథ్యంలో హెచ్-1బీ వీసా ఫీజులను మరోసారి పెంచితే భారతీయ ఉద్యోగులు అధికంగా పనిచేస్తున్న టెక్నాలజీ కంపెనీలపై ఆర్థిక భారం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఫీజుల పెంపు ఎంత మేర ఉంటుంది, ఏ పిటిషన్లకు వర్తిస్తుంది అనే వివరాలు డీహెచ్‌ఎస్ అధికారిక ప్రతిపాదన విడుదల చేసిన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది.