Trump- Biden: న్యూ హాంప్‌షైర్ ఎన్నికల్లో ట్రంప్, బైడెన్ విజయం.. అధ్యక్ష బరిలో ఈ ఇద్దరి మధ్యే పోరు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి డొనాల్డ్ ట్రంప్, జో బైడన్ మధ్య పోటీ దాదాపు ఖరారైంది. తాజాగా న్యూ హాంప్‌షైర్ రాష్ట్రంలో జరిగిన రిపబ్లికన్ పార్టీ అంతర్గత ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు ట్రంప్ విజయం సాధించారు. అదే రాష్ట్రంలో జరిగిన డెమోక్రటిక్ పార్టీ అంతర్గత ఎన్నికల్లో జో బైడెన్ గెలుపొందారు. ఈ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, జొ బైడన్ తలపడటం ఖాయంగా కనిపిస్తోంది. రిపబ్లికన్ పార్టీ ఎన్నికల్లో ట్రంప్‌కు 55.4శాతం ఓట్లు రాగా, నిక్కీ హేలీకి 42శాతం ఓట్లు వచ్చాయి. డెమోక్రటిక్ పార్టీ ఎన్నికల్లో బైడెన్‌కు 66.8శాతం ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో నిలిచిన డీన్ ఫిలిప్స్‌కు కేవలం 20శాతం ఓట్లు వచ్చాయి.
బైడెన్ పేరు లేకపోయినా భారీ విజయం
న్యూ హాంప్‌షైర్‌లో జరిగిన డెమొక్రాటిక్ పార్టీ ఎన్నికల్లో అధ్యక్షుడు బైడెన్ పేరు లేకపోయినా, ఆయన అఖండ మెజారిటీతో గెలవడం గమనార్హం. న్యూ హాంప్‌షైర్‌లో పార్టీ ఎన్నికల తేదీలను ప్రకటించిన తర్వాత.. ఆ రాష్ట్రంలో ఎన్నికలను ఆలస్యంగా నిర్వహించాలని బిడెన్ విజ్ఞప్తి చేశారు. అయితే అందుకు పార్టీ నిరాకరించింది. దీంతో ఆగ్రహం చెందిన బైడెన్ న్యూ హాంప్‌షైర్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. అయినప్పటికీ, డెమొక్రాటిక్ పార్టీలో అతని మద్దతుదారులు బైడెన్ తరఫున ప్రచారం చేశారు. దీంతో బైడెన్ సునాయసంగా ఎన్నికల్లో విజయం సాధించారు. అమెరికాలో రైట్-ఇన్ ప్రచారంలో ఓటర్లు జాబితాలో పేరు లేనప్పటికీ.. బ్యాలెట్ పేపర్‌పై తమకు ఇష్టమైన అభ్యర్థి పేరును నాయకులు రాసుకోవచ్చు.