Loading...
New York Horse Carriages: 150 ఏళ్ల సంప్రదాయానికి ముగింపు.. గుర్రపు బగ్గీల నిషేధానికి న్యూయార్క్‌ ఆమోదం
150 ఏళ్ల సంప్రదాయానికి ముగింపు.. గుర్రపు బగ్గీల నిషేధానికి న్యూయార్క్‌ ఆమోదం

New York Horse Carriages: 150 ఏళ్ల సంప్రదాయానికి ముగింపు.. గుర్రపు బగ్గీల నిషేధానికి న్యూయార్క్‌ ఆమోదం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2026
10:28 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ యువకుడి మృతికి కారణమైన ప్రమాదం నేపథ్యంలో అమెరికాలోని న్యూయార్క్‌ సిటీ కౌన్సిల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 150 ఏళ్లుగా కొనసాగుతున్న గుర్రపు బగ్గీల సంప్రదాయానికి ముగింపు పలికేందుకు ఆమోదం తెలిపింది. సెంట్రల్‌ పార్క్‌లో గుర్రపు బగ్గీలను నిషేధించే బిల్లుకు సిటీ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. అయితే, న్యూయార్క్‌ మేయర్‌ జోహ్రాన్‌ మమ్దానీ (Zohran Mamdani) ఈ బిల్లుపై సంతకం చేసిన తర్వాతే ఇది చట్టంగా మారుతుంది. ఈ నిషేధం 2028 నుంచి అమల్లోకి రానుంది.

వివరాలు 

బెదిరిపోయిన గుర్రం

ఈ ఏడాది జూన్‌లో భారతీయుడు దీపక్‌ మహాజన్‌ తన కుటుంబంతో కలిసి తొలిసారిగా న్యూయార్క్‌ పర్యటనకు వచ్చారు.

ఈ సందర్భంగా వారంతా సెంట్రల్‌ పార్క్‌లో గుర్రపు బగ్గీ ఎక్కారు. పర్యాటకులను ఫొటోలు తీసేందుకు బగ్గీ నడిపే వ్యక్తి కిందకు దిగిన సమయంలో గుర్రం ఒక్కసారిగా బెదిరిపోయింది.

అదుపుతప్పి వేగంగా పరుగులు తీసింది. ఈ క్రమంలో బగ్గీలో ప్రయాణిస్తున్న దీపక్‌ కుమారుడు రోమాంచ్‌ (18) కిందపడిపోయాడు.

ఈ ప్రమాదంలో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో రోమాంచ్‌ ప్రాణాలు కోల్పోయాడు.

వివరాలు 

2028 వరకు గడువు

ఈ విషాద ఘటన తర్వాత సెంట్రల్‌ పార్క్‌లో గుర్రపు బగ్గీలను నిషేధించాలనే డిమాండ్లు మరింత పెరిగాయి.

ఈ నేపథ్యంలోనే నిషేధానికి సంబంధించిన బిల్లుపై సిటీ కౌన్సిల్‌ ఓటింగ్‌ నిర్వహించింది.

చివరకు బిల్లుకు ఆమోదం తెలిపింది. 2028 నుంచి గుర్రపు బగ్గీలపై నిషేధం అమల్లోకి రానుండటంతో న్యూయార్క్‌లో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం ముగియనుంది.

మరోవైపు,ఈ నిర్ణయంపై గుర్రపు బగ్గీల నిర్వహణపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

నిషేధం అమల్లోకి వస్తే తమ జీవనోపాధి దెబ్బతింటుందని పేర్కొంటున్నాయి.

ఈ నిర్ణయాన్ని న్యాయస్థానంలో సవాలు చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి.

అయితే, బగ్గీలను నడిపే కార్మికులు ప్రత్యామ్నాయ ఉపాధిని వెతుక్కోవడానికి వీలుగా 2028 వరకు గడువు ఇచ్చినట్లు న్యూయార్క్‌ సిటీ కౌన్సిల్‌ వెల్లడించింది.

ADVERTISEMENT