chef Vikas Khanna: న్యూయార్క్ రాష్ట్రం నుంచి చెఫ్ వికాస్ ఖన్నాకు అరుదైన గౌరవం.. తొలి భారతీయుడిగా రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో భారతీయ చెఫ్ వికాస్ ఖన్నాకు అరుదైన గౌరవం దక్కింది. వంటకళ, కళాత్మక రంగాల్లో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆయనను సత్కరించారు. ఆసియన్ అమెరికన్ అండ్ పసిఫిక్ ఐలాండర్ (AAPI) హెరిటేజ్ మంత్ సందర్భంగా న్యూయార్క్ రాష్ట్ర చరిత్రలో ఈ గౌరవం అందుకున్న తొలి భారతీయుడిగా వికాస్ ఖన్నా నిలిచారు. గత వారం న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ కాథీ హోకుల్, రాష్ట్ర రాజధాని ఆల్బనీలో జరిగిన AAPI హెరిటేజ్ మంత్ వేడుకల్లో వికాస్ ఖన్నాకు "స్పెషల్ సిటేషన్" అందజేశారు. ఈ సందర్భంగా స్పందించిన వికాస్ ఖన్నా, ఈ గౌరవం తనకు ఎంతో భావోద్వేగపూరితమైనదిగా, వినమ్రతను కలిగించేదిగా ఉందన్నారు.
వివరాలు
తొలి భారతీయుడిగా రికార్డ్..
న్యూయార్క్ రాష్ట్ర చరిత్రలో ఈ గౌరవం అందుకున్న తొలి భారతీయుడిగా నిలవడం మరింత ప్రత్యేకమని తెలిపారు. అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సమాజంగా AAPI కమ్యూనిటీ నిలుస్తోందని వికాస్ ఖన్నా పేర్కొన్నారు. 25 మిలియన్లకు పైగా ప్రజలు, విభిన్న సంస్కృతులు, కథలు, పోరాటాలు, ఆశయాలకు ఈ కమ్యూనిటీ ప్రతీక అని చెప్పారు. ఇది కేవలం తన వ్యక్తిగత విజయమే కాకుండా ఆశ, గుర్తింపు, ప్రాతినిధ్యం, వైవిధ్య శక్తికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. మే 9న జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన వికాస్ ఖన్నా, "ఒక భారతీయ చెఫ్‌ను ఈ వేదికపైకి తీసుకురావడం నాకు మాత్రమే గౌరవం కాదు. మన కథలకు, మన సంస్కృతికి విలువ ఉందనే విషయానికి ఇది ప్రతీక" అని అన్నారు.
వివరాలు
ప్రపంచ ప్రఖ్యాత వంట కళా దిగ్గజం...
న్యూయార్క్ నగరం ప్రపంచానికి ఆశాకిరణంగా నిలవడానికి ప్రధాన కారణం బలహీన వర్గాలను రక్షించడమేనని వికాస్ ఖన్నా పేర్కొన్నారు. ముఖ్యంగా వలసదారులే ఎక్కువగా బలహీన స్థితిలో ఉంటారని, అలాంటి వారిని కాపాడటంలో ఈ నగరం ముందుంటుందని చెప్పారు. ఇక AAPI హెరిటేజ్ మంత్ వేడుకల్లో గవర్నర్ కాథీ హోకుల్ కూడా పాల్గొన్నారు. సమాజంలో విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా ఐక్యత అవసరమని ఆమె పిలుపునిచ్చారు. వివిధ సంస్కృతులు న్యూయార్క్ రాష్ట్రాన్ని మరింత బలంగా మార్చుతున్నాయని తెలిపారు. వలసదారుల హక్కులను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. అమృత్‌సర్ నుంచి న్యూయార్క్ వరకు వికాస్ ఖన్నా చేసిన ప్రయాణాన్ని ప్రశంసిస్తూ, ఆయనను "ప్రపంచ ప్రఖ్యాత వంటకళా దిగ్గజం"గా సిటేషన్‌లో పేర్కొన్నారు.