New York : వందేళ్ల చరిత్రలో తొలిసారి.. తుపాను హెచ్చరికలతో న్యూయార్క్ థ్యాంక్స్‌గివింగ్ పరేడ్ వాయిదా
ఈ వార్తాకథనం ఏంటి
న్యూయార్క్‌లో ఏటా ఘనంగా నిర్వహించే 'మేసీస్ థ్యాంక్స్‌గివింగ్ డే పరేడ్'కు ఈసారి ప్రకృతి ఆటంకం కలిగించింది. వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా ఈ వేడుకను వాయిదా వేశారు. అమెరికా తూర్పు తీరాన్ని భారీ తుపాను (నార్‌ఈస్టర్)ముంచెత్తే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గురువారం జరగాల్సిన 100వ వార్షిక పరేడ్‌ను నవంబర్ 28వ తేదీ శనివారానికి మార్చినట్లు ప్రకటించారు. తుపాను ప్రభావంతో గంటకు 60 నుంచి 65 మైళ్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ వెల్లడించారు. జాతీయ వాతావరణ సంస్థ సైతం తీవ్ర గాలులు, తీరప్రాంతాల్లో వరదలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
వివరాలు
గత ప్రమాదాలే పాఠం..
ఈ నేపథ్యంలో పరేడ్‌లో పాల్గొనేవారు, వీక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వేడుకను వాయిదా వేసినట్లు నిర్వాహక సంస్థ మేసీస్ స్పష్టం చేసింది.
నగర అధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది.
'ది న్యూయార్క్ పోస్ట్' కథనం ప్రకారం.. ఈ పరేడ్ వందేళ్ల చరిత్రలో వాయిదా పడటం ఇదే తొలిసారి.
అయితే గతంలోనూ బలమైన గాలుల కారణంగా ఈ వేడుకలో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
ముఖ్యంగా 1997లో వీచిన ఈదురుగాలులకు 'క్యాట్ ఇన్ ది హ్యాట్', 'బార్నీ' వంటి భారీ బెలూన్లు అదుపుతప్పాయి.
వివరాలు
గత ప్రమాదాలే పాఠం..
గాలుల తీవ్రతకు అవి వీధుల్లో అటూఇటూ కదులుతూ ప్రమాదకర పరిస్థితులు సృష్టించాయి.
ఈ క్రమంలో ఓ బెలూన్ వీధి దీపాన్ని ఢీకొట్టడంతో ఓ మహిళ స్పృహతప్పి పడిపోయింది.
గతంలో ఎదురైన ఈ చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని,ఈసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
అందులో భాగంగానే పరేడ్‌ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.