Nithya Raman: కేరళలో పుట్టి.. లాస్‌ఏంజెలెస్ మేయర్ పీఠం దిశగా నిత్యా రామన్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతికి చెందిన పలువురు విజయాలు సాధించారు. ఈ క్రమంలో కేరళలో పుట్టిన నిత్యా రామన్ లాస్‌ఏంజెలెస్ మేయర్ ఎన్నికల్లో విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ప్రస్తుత మేయర్ కేరెన్ బాస్‌పై ఆమె ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తాజా సమాచారం ప్రకారం నిత్యా రామన్‌కు 51.1 శాతం ఓట్లు పోలవగా.. బాస్‌కు 48.33 శాతం ఓట్లు వచ్చాయి. ఈ విజయంతో ఆమె లాస్‌ఏంజెలెస్ నగరానికి తొలి ఆసియా-అమెరికన్ మేయర్‌గా రికార్డు సృష్టించనున్నారు. తోటి డెమోక్రటిక్ నేత కేరెన్ బాస్‌పై పోటీ చేయాలని నిత్యా రామన్ చివరి నిమిషంలో నిర్ణయించుకున్నారు. అప్పటివరకు బాస్‌కు మద్దతుగా ఉన్న ఆమె.. అనూహ్యంగా మేయర్ ఎన్నికల బరిలోకి దిగడంతో పలువురు నేతలు ఆశ్చర్యపోయారు.
వివరాలు
మౌలిక సదుపాయాల అభివృద్ధిపై నిత్యా రామన్ దృష్టి
బాస్ మేయర్‌గా ఉన్న సమయంలో లాస్‌ఏంజెలెస్‌లో కార్చిచ్చులు, హాలీవుడ్‌లో ఉద్యోగాల కోత వంటి సమస్యలు ఎదురయ్యాయి.
ఈ నేపథ్యంలో నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై నిత్యా రామన్ దృష్టి సారించారు.
నగరంలోని రోడ్లపై గుంతలను పూడ్చడం, వీధి దీపాలు సరిగా వెలిగేలా చూడటం వంటి హామీలను ఆమె ఇచ్చారు.
మున్సిపల్ సౌకర్యాలను మెరుగుపరుస్తానని ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు.
నిత్యా రామన్‌కు కెన్నెత్ మేజా మద్దతు ఇవ్వడంతో ఈ పోరు మరింత ఆసక్తికరంగా మారింది. రామన్, మేజా కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ట్రంప్ పాలన ముగిసే సమయానికి లాస్‌ఏంజెలెస్ మేయర్‌గా నిత్యా రామన్ బాధ్యతలు చేపట్టనున్నారు.
2028లో జరిగే ఒలింపిక్స్ నిర్వహణ బాధ్యతలు కూడా ఆమెపై ఉండనున్నాయి.
వివరాలు
ఆరేళ్ల వయసులో అమెరికాకు..
నిత్యా రామన్ 1981లో కేరళలో జన్మించారు. ఆరేళ్ల వయసులో కుటుంబంతో కలిసి అమెరికాకు వలస వెళ్లారు.
22 ఏళ్ల వయసులో అమెరికా పౌరసత్వం పొందారు. హార్వర్డ్ యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు.
అనంతరం మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో అర్బన్ ప్లానింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు.
నగరాభివృద్ధి, పట్టణ సమస్యలపై పరిశోధన కోసం 'ట్రాన్స్‌పరెంట్ చెన్నై' అనే అర్బన్ రీసెర్చ్ గ్రూపును స్థాపించారు.
2013లో లాస్‌ఏంజెలెస్‌కు మారిన ఆమె.. అక్కడి సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కార్యాలయంలో పనిచేశారు.
అనంతరం 'టైమ్స్ అప్ ఎంటర్‌టైన్‌మెంట్' సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు.