LOADING...
Donald Trump: చమురు ధరల తగ్గింపు కోసమే ఈ నాటకాలు.. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ ఘాటు స్పందన...
చమురు ధరల తగ్గింపు కోసమే ఈ నాటకాలు.. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ ఘాటు స్పందన...

Donald Trump: చమురు ధరల తగ్గింపు కోసమే ఈ నాటకాలు.. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ ఘాటు స్పందన...

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 23, 2026
06:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి మాటల పోరు తీవ్రంగా మారింది. ఇరాన్‌పై సైనిక దాడులను ఐదు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా, ఆ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రంప్ చెప్పినట్లు ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేస్తూ, తమ హెచ్చరికల కారణంగానే అమెరికా వెనక్కి తగ్గిందని వెల్లడించింది.

వివరాలు 

"చర్చలు జరగలేదు.. మా హెచ్చరికలే కారణం"

ఇరాన్ అధికార వర్గాల ప్రకారం, ట్రంప్‌తో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి చర్చలు జరగలేదు. అమెరికా అధ్యక్షుడు చెప్పిన చర్చల కథనం పూర్తిగా అసత్యమని వారు తేల్చిచెప్పారు. తమ హెచ్చరికల ప్రభావంతోనే అమెరికా దాడులను వాయిదా వేసిందని పేర్కొన్నారు. చమురు ధరలను ప్రభావితం చేయడానికే ఈ ప్రకటనలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. గల్ఫ్ దేశాల చొరవ.. ఇరాన్ నిరాకరణ యుద్ధాన్ని నివారించేందుకు గల్ఫ్ దేశాలు మధ్యవర్తిత్వానికి ప్రయత్నించాయని ఇరాన్ తెలిపింది. అయితే ఆ చర్చల ప్రతిపాదనను తాము తిరస్కరించినట్లు స్పష్టం చేసింది. యుద్ధం ప్రారంభించిన దేశమే (ఇజ్రాయెల్) ముందుగా యుద్ధ విరమణ ప్రతిపాదన చేయాలని ఇరాన్ దృఢంగా పేర్కొంది.

వివరాలు 

ట్రంప్ ప్రకటనలో ఏముంది?

ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో మాట్లాడుతూ, "గత రెండు రోజులుగా ఇరాన్‌తో జరిగిన చర్చలు సానుకూలంగా సాగాయి. అందువల్ల ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలు, ఇతర మౌలిక సదుపాయాలపై దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేయాలని రక్షణ శాఖకు ఆదేశాలు ఇచ్చాను. ఈ చర్చల ఫలితాల ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటాం" అని వెల్లడించారు. ఇరాన్ ఘాటు ప్రతిస్పందన ట్రంప్ ప్రకటన వెలువడిన వెంటనే ఇరాన్ స్పందించింది. ఇరాన్‌కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం, ట్రంప్ తన ఓటమిని దాచిపెట్టేందుకు చర్చల కథనాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. తమ హెచ్చరికలే అమెరికా వెనక్కి తగ్గడానికి కారణమని పేర్కొన్నారు.

Advertisement

వివరాలు 

చమురు ధరలపై ప్రభావం

ఇదిలా ఉండగా, ట్రంప్ ప్రకటన ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. ముడి చమురు ధరలు ఒక్కసారిగా గణనీయంగా పడిపోయాయి. 48 గంటల గడువు తర్వాత కీలక ప్రకటన గతంలో ఇచ్చిన 48 గంటల గడువు ముగిసే సమయంలో ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఒకవైపు అమెరికా చర్చలు జరిగాయని చెబుతుండగా, మరోవైపు ఇరాన్ పూర్తిగా ఖండించడంతో పరిస్థితి గందరగోళంగా మారింది.

Advertisement