Loading...
Eiffel Tower: బాప్స్ బృందానికి క్లీన్‌చిట్.. ఈఫిల్ టవర్ వివాదంపై కీలక నివేదిక
బాప్స్ బృందానికి క్లీన్‌చిట్.. ఈఫిల్ టవర్ వివాదంపై కీలక నివేదిక

Eiffel Tower: బాప్స్ బృందానికి క్లీన్‌చిట్.. ఈఫిల్ టవర్ వివాదంపై కీలక నివేదిక

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 02, 2026
01:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

పారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ వద్ద బోచాసన్‌వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ (బీఏపీఎస్‌-బాప్స్‌) ప్రతినిధుల బృందం పర్యటన ఇటీవల వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై చేపట్టిన దర్యాప్తు పూర్తయింది. బాప్స్‌ బృందం మహిళా సిబ్బందిని విధుల నుంచి తప్పించాలని ఎలాంటి అభ్యర్థన చేయలేదని దర్యాప్తు అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఆ సంస్థకు క్లీన్‌చిట్‌ లభించింది.

వివరాలు 

మహిళలను తప్పించాలని కోరలేదు

ఈఫిల్‌ టవర్‌లో తాము ఉన్న సమయంలో సంబంధిత మార్గంలో మహిళలను అనుమతించవద్దని బాప్స్‌ ప్రతినిధులు ఎలాంటి విజ్ఞప్తి చేయలేదని పారిస్‌ నగర ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ వెల్లడించారు.

బాప్స్‌ బృందం వెంట తీసుకొచ్చిన కొన్ని మతపరమైన విగ్రహాలను మహిళలు తాకకుండా చూడాలని మాత్రమే కోరినట్లు దర్యాప్తులో తేలింది.

అయితే ఆ అభ్యర్థనను అమలు చేసే క్రమంలో అధికారుల మధ్య సరైన సమన్వయం లేకపోవడం, వరుసగా జరిగిన కొన్ని తప్పిదాల కారణంగా పరిస్థితి గందరగోళంగా మారిందని అధికారులు తెలిపారు.

బాప్స్‌ ప్రతినిధుల అభ్యర్థనను కొందరు అధికారులు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారని పేర్కొన్నారు.

వివరాలు 

మహిళా ఉద్యోగులను తాత్కాలికంగా వేరే ప్రాంతానికి పంపారు

బాప్స్‌ ప్రతినిధుల బృందం ఈఫిల్‌ టవర్‌ ఉత్తర స్తంభంపైకి వెళ్తున్న సమయంలో అక్కడి రిసెప్షన్‌, కస్టమర్‌ సర్వీసెస్‌ విభాగాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను కొద్దిసేపు మరో ప్రాంతానికి వెళ్లాల్సిందిగా అధికారులు కోరారు.

ఆ తర్వాత ఆ ప్రాంతంలో పూర్తిగా పురుష సిబ్బందినే విధుల్లో ఉంచారు.

దీంతో మహిళా సిబ్బందిని బాప్స్‌ బృందం కోరడంతోనే తొలగించారనే అభిప్రాయం ఏర్పడి వివాదం తలెత్తింది.

ADVERTISEMENT

వివరాలు 

దర్యాప్తు నివేదికను స్వాగతించిన బాప్స్

పారిస్‌ నగర ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ దర్యాప్తు నివేదికను బాప్స్‌ స్వాగతించింది.

మహిళా సిబ్బందిని విధుల నుంచి తొలగించాలని తాము ఎలాంటి డిమాండ్‌ చేయలేదని మరోసారి స్పష్టం చేసింది.

తమ అభ్యర్థన కేవలం తమతో తీసుకొచ్చిన మతపరమైన విగ్రహాలను మహిళలు తాకకుండా చూడాలనే ఉద్దేశంతోనే ఉందని తెలిపింది.

మరోవైపు, బాప్స్‌ బృందం ఈఫిల్‌ టవర్‌ను సందర్శించిన సమయంలో మహిళా సిబ్బందిని విధుల నుంచి తప్పించిన ఘటనపై అక్కడి నిర్వహణ సంస్థ చర్యలు తీసుకుంది.

ఈ వ్యవహారానికి సంబంధించి సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ పాట్రిక్‌ బ్రాంకో రుయివోను ఆ పదవి నుంచి తొలగించింది.

ADVERTISEMENT