Loading...
Homeland Security: అమెరికాలో భారీ డేటా లీక్‌.. 40 వేల మంది భద్రతా సిబ్బంది వివరాలు బహిర్గతం
అమెరికాలో భారీ డేటా లీక్‌.. 40 వేల మంది భద్రతా సిబ్బంది వివరాలు బహిర్గతం

Homeland Security: అమెరికాలో భారీ డేటా లీక్‌.. 40 వేల మంది భద్రతా సిబ్బంది వివరాలు బహిర్గతం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2026
02:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అంతర్గత భద్రతా వ్యవస్థలో భారీ సైబర్‌ భద్రతా వైఫల్యం వెలుగులోకి వచ్చింది. అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్న ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ),కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్‌ (సీబీపీ)సహా పలు ఫెడరల్‌ విభాగాలకు చెందిన 40వేల మందికి పైగా ఉద్యోగులు, కాంట్రాక్టర్ల వ్యక్తిగత వివరాలు బహిర్గతమయ్యాయి. అమెరికా భద్రతా వర్గాల్లో ఈ ఘటన తీవ్ర ఆందోళనకు కారణమైంది. అంతర్జాతీయ వార్తా సంస్థల కథనాల ప్రకారం.. ప్రముఖ హ్యాకింగ్‌ డేటా ప్లాట్‌ఫారమ్‌ డిస్ట్రిబ్యూటెడ్ డెన్యాల్ ఆఫ్ సీక్రెట్స్‌ ఈ సమాచారాన్ని 'ఐస్‌పిక్‌' (ICEPick) పేరుతో డేటాబేస్‌ రూపంలో విడుదల చేసింది. ప్రభుత్వ భద్రతా విభాగాలకు చెందిన సిబ్బంది వివరాలు ఇలా బహిర్గతం కావడం సైబర్‌ భద్రతాపరంగా కీలక పరిణామంగా మారింది.

వివరాలు 

బహిర్గతమైన కీలక వివరాలివే..

ఈ డేటా లీక్‌ సాధారణ సమాచారానికే పరిమితం కాలేదు. ఫెడరల్‌ ఏజెన్సీల్లో పనిచేస్తున్న సిబ్బంది పూర్తి పేర్లు, అధికారిక ఈమెయిల్‌ చిరునామాలు, ఫోన్‌ నంబర్లు, కార్యాలయాల చిరునామాలు, ఉద్యోగ హోదాలు, వారికి కేటాయించిన విధుల వివరాలు బయటకు వచ్చినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

వీటిలో కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్‌ (సీబీపీ) విభాగానికి చెందిన సుమారు 21 వేల రికార్డులు ఉన్నట్లు సమాచారం.

సైబర్‌ సెక్యూరిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ (సీఐఎస్‌ఏ) సిబ్బందికి సంబంధించిన వివరాలు కూడా లీకైన డేటాలో ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి.

మరోవైపు.. నిఘా విభాగాలు, రహస్య కార్యకలాపాలు నిర్వహించే బృందాలు, కంప్యూటర్‌ ఫోరెన్సిక్స్‌ విభాగాల్లో పనిచేసే కీలక అధికారుల వివరాలు సైతం బయటకు రావడం ఆందోళన కలిగిస్తోంది.

వివరాలు 

వలసదారుల బహిష్కరణ చర్యల వేళ..

ఈ సమాచారం దుర్వినియోగమైతే సంబంధిత అధికారుల వ్యక్తిగత భద్రతతో పాటు వారు నిర్వహించే కార్యకలాపాలపైనా ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అమెరికాలో అక్రమ వలసదారులను గుర్తించి బహిష్కరించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగం, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం కఠిన చర్యలు చేపడుతున్న సమయంలో ఈ డేటా లీక్‌ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇప్పటికే దేశవ్యాప్తంగా వలసదారుల బహిష్కరణ ప్రక్రియను ముమ్మరం చేసిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే అధికారుల వ్యక్తిగత వివరాలు బహిర్గతం కావడం వారి భద్రతపై ఆందోళన పెంచుతోంది.

ఈ నేపథ్యంలో ఫెడరల్‌ ఏజెంట్లను లక్ష్యంగా చేసుకుని డాక్సింగ్‌ దాడులు పెరిగే అవకాశం ఉందని సైబర్‌ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

భద్రతా లోపంపై అంతర్గత దర్యాప్తు..

డాక్సింగ్‌ అంటే ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని అతడి అనుమతి లేకుండా బహిరంగంగా వెల్లడించడం.

ఇలాంటి చర్యల ద్వారా అధికారులను బెదిరించడం, వేధించడం లేదా వారి వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగించడం సాధ్యమవుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్‌ఎస్‌), సంబంధిత ఏజెన్సీలు ఇంకా సమగ్ర అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

అయితే సిబ్బంది వివరాలు బహిర్గతం కావడంపై అంతర్గత దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

ADVERTISEMENT

వివరాలు 

భద్రతా లోపంపై అంతర్గత దర్యాప్తు..

ఈ భద్రతా లోపానికి గల కారణాలను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

సింగిల్ సైన్‌-ఆన్‌ (ఎస్‌ఎస్‌ఓ) సేవలు అందించే సాంకేతిక సంస్థల ద్వారా ఈ ఘటన జరిగిందా? లేదా ప్రభుత్వ వ్యవస్థల్లో పనిచేసే అంతర్గత వ్యక్తుల ప్రమేయం ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

దర్యాప్తులో వెల్లడయ్యే అంశాలను బట్టి ఈ డేటా లీక్‌ వెనుక ఉన్న కారణాలు, దాని ప్రభావం, భద్రతా వ్యవస్థల్లో ఉన్న లోపాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ADVERTISEMENT