Page Loader
Iran Nuclear Deal: అణు చర్చలకు శ్రీకారం.. ఒమన్‌లో ఇరాన్‌-అమెరికా ప్రతినిధుల భేటీ
అణు చర్చలకు శ్రీకారం.. ఒమన్‌లో ఇరాన్‌-అమెరికా ప్రతినిధుల భేటీ

Iran Nuclear Deal: అణు చర్చలకు శ్రీకారం.. ఒమన్‌లో ఇరాన్‌-అమెరికా ప్రతినిధుల భేటీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 12, 2025
10:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

అణు చర్చల విషయమై అమెరికా, ఇరాన్‌లు కీలక ముందడుగు వేశాయి. శనివారం ఒమన్‌ రాజధాని వేదికగా ఇరుదేశాల ప్రతినిధులు సమావేశమయ్యారు. తొలిదశ చర్చలు ముగిశాయని వచ్చే వారం మరిన్ని చర్చలు జరగనున్నట్లు ఇరాన్‌ అధికారిక మీడియా స్పష్టం చేసింది. ఈ సమావేశం ఒమన్‌ విదేశాంగ మంత్రి సమక్షంలో జరిగింది. అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్‌ విట్కాఫ్‌, ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మధ్య సంక్షిప్తంగా చర్చలు జరిగాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న తాత్విక విభేదాల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ప్రత్యక్ష సంభాషణ చోటు చేసుకోవడం గమనార్హం. ఒమన్‌ సమయానుసారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైన చర్చలు సాయంత్రం 5.50 వరకు సాగినట్లు సమాచారం.

Details

దేశ ప్రజల పరిరక్షణే ప్రధాన ధ్యేయం : ఇరాన్

చర్చలు పరోక్షంగా ప్రారంభమయ్యాయని, తమ దేశ ప్రయోజనాల పరిరక్షణే ప్రధాన లక్ష్యమని ఇరాన్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్‌ బఘేయి ధ్రువీకరించారు. అణు ఒప్పందాన్ని ఇరాన్‌ అంగీకరించకపోతే సైనిక చర్యకు వెనకాడమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవలి వ్యాఖ్యలలో స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన ఇరాన్‌ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ, దాడులు జరిగితే తమవంతు ఎదురుదాడికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ట్రంప్‌ మొదటిసారి అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు ఇరాన్‌తో సంబంధాలు బలహీనంగా కొనసాగాయి. 2018లో ఆయన అధికారంలో ఉన్న సమయంలోనే అమెరికా అణు ఒప్పందం నుంచి బయటపడింది.

Details

ప్రత్యక్ష చర్చలకే ప్రాముఖ్యత

తత్ఫలితంగా టెహ్రాన్‌పై ఆంక్షలు విధించారు. అప్పటినుంచి పలు పర్యాయాల్లో పరోక్ష చర్చలు జరిగినప్పటికీ అవి విజయవంతం కాలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో ట్రంప్‌ మరోసారి అణు ఒప్పందంపై చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. దీనిలో భాగంగా ఇరాన్‌తో చర్చలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అయితే, ప్రత్యక్ష చర్చలకే ప్రాముఖ్యత ఇస్తామని పెజెష్కియాన్‌ ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రకటన అనంతరం తాజా భేటీ జరిగింది.