Loading...
Strait of Hormuz: 24 గంటల్లో హర్మూజ్‌ జలసంధిని దాటినవి కేవలం 3 నౌకలే..!
24 గంటల్లో హర్మూజ్‌ జలసంధిని దాటినవి కేవలం 3 నౌకలే..!

Strait of Hormuz: 24 గంటల్లో హర్మూజ్‌ జలసంధిని దాటినవి కేవలం 3 నౌకలే..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2026
02:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న పరస్పర దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. ఈ ప్రభావం ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర వాణిజ్య మార్గాల్లో ఒకటైన హర్మూజ్‌ జలసంధిపై స్పష్టంగా కనిపిస్తోంది. భద్రతా ఆందోళనల కారణంగా నౌకల రాకపోకలు గణనీయంగా తగ్గిపోయాయి. గత 24 గంటల్లో ఈ మార్గం (Strait of Hormuz)గుండా కేవలం మూడు నౌకలు మాత్రమే ప్రయాణించడం పరిస్థితి ఎంత ఆందోళనకరంగా మారిందో సూచిస్తోంది. షిప్పింగ్‌ డేటా ప్రకారం.. బుధవారం హర్మూజ్‌ జలసంధిని 11 నౌకలు దాటగా,గురువారం ఆ సంఖ్య కేవలం మూడుకు పరిమితమైంది. ఇరాన్‌కు సంబంధించిన నౌకలపై అమెరికా దిగ్బంధన చర్యలు, వరుస సైనిక దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో అనేక వాణిజ్య నౌకలు తమ ప్రయాణాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాయి.

వివరాలు 

గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌ ప్రాంతంలో నౌకలను అడ్డుకున్న అమెరికా 

మరికొన్ని నౌకలు హర్మూజ్‌ మార్గంలో ముందుకు సాగకుండా యూ-టర్న్‌ తీసుకుని ప్రత్యామ్నాయ సముద్ర మార్గాలను ఎంచుకుంటున్నట్లు సమాచారం.

ఇంధన ట్యాంకర్‌ మిరాన్, ఎల్పీజీని తరలిస్తున్న నోరిటా నౌకలు ఇరాన్‌ సూచించిన మార్గంలో హర్మూజ్‌ జలసంధిని దాటినట్లు షిప్‌ ట్రాకింగ్‌ సంస్థ కెప్లెర్‌ వెల్లడించింది.

అయితే, గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌ ప్రాంతంలో అమెరికా అధికారులు ఈ నౌకలను అడ్డుకున్నట్లు తెలిపింది.

ఇదే సమయంలో ఇరాక్‌ నుంచి ఇంధనాన్ని తీసుకెళ్తున్న మరో నౌక కూడా గల్ఫ్‌ ప్రాంతం నుంచి వెనక్కి మళ్లినట్లు సమాచారం.

వివరాలు 

మరో ట్యాంకర్‌పై క్షిపణి దాడి

ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఒమన్‌ తీరానికి సుమారు 19 నాటికల్‌ మైళ్ల దూరంలో ప్రయాణిస్తున్న ఓ ట్యాంకర్‌పై క్షిపణి దాడి జరిగినట్లు యూకే మారిటైమ్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌ ఏజెన్సీ వెల్లడించింది.

గుర్తుతెలియని క్షిపణి నౌకను తాకినట్లు తెలిపింది. అయితే, ఆ ట్యాంకర్‌కు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించలేదు.

ఈ ఘటనలో నౌకలో ఉన్న సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.

ADVERTISEMENT

వివరాలు 

అమెరికా దాడులకు ఇరాన్‌ ప్రతీకారం

అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్‌ కూడా తన సైనిక చర్యలను మరింత వేగవంతం చేసింది. జోర్డాన్‌లో ఉన్న అమెరికా యుద్ధ విమానాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్లు ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (IRGC) ప్రకటించింది.

మరోవైపు ఉత్తర ఇరాక్‌లోని కుర్దిష్‌ అసమ్మతి గ్రూప్‌పై టెహ్రాన్‌ దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

ADVERTISEMENT