Page Loader
'Operation Spider Web': రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులు
రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులు

'Operation Spider Web': రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 02, 2025
09:26 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యాలోని కీలకమైన వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్ అత్యంత ఖచ్చితంగా, పెద్ద ఎత్తున డ్రోన్లతో దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఈ దాడుల కోసం ఉక్రెయిన్ సుమారు ఏడాదిన్నర పాటు గోప్యంగా ప్రణాళిక రూపొందించి, 'ఆపరేషన్ స్పైడర్ వెబ్' అనే పేరుతో అమలు చేసింది. ఈ దాడుల్లో రష్యాకు చెందిన ప్రధాన బాంబర్ విమానాలు నాశనమైనట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. అయితే, రష్యా మాత్రం ఈ దాడులను ఎదుర్కొన్నామని, కేవలం తక్కువ స్థాయిలోనే నష్టం వాటిల్లిందని తెలిపింది.

వివరాలు 

ఆపరేషన్ స్పైడర్ వెబ్ - సవివరాలు 

బీబీసీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఉక్రెయిన్ రహస్య దర్యాప్తు సంస్థ ఎస్‌బీయూ ఈ ఆపరేషన్‌ను అత్యంత చాకచక్యంగా అమలు చేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ స్వయంగా ఈ దాడి ప్రణాళికను పర్యవేక్షించినట్లు ఎస్‌బీయూ వర్గాలు తెలిపాయి. తొలుత FPV డ్రోన్లను రహస్యంగా రష్యాలోకి చొరబాటుదల చేసి,అనంతరం చెక్కతో తయారు చేసిన కదిలే క్యాబిన్లను కూడా అక్కడికి తరలించారు. ఈ క్యాబిన్లను ట్రక్కులపై అమర్చి,వాటి పైకప్పుల కింద డ్రోన్లను దాచారు. దాడి సమయంలో ప్రత్యేక సంకేతం అందిన వెంటనే,రిమోట్ కంట్రోల్ సాయంతో క్యాబిన్ల పైకప్పులు తెరిచారు. దీంతో ట్రక్కుల నుంచే అనేక డ్రోన్లు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి, సమీపంలోని రష్యా వైమానిక స్థావరాలపై దాడులు ప్రారంభించాయి.

వివరాలు 

ఉక్రెయిన్ ప్రకటనలు - నష్టం విశ్లేషణ 

భద్రతా రంగానికి చెందిన నిపుణురాలు మరియా అవదీవా ఈ దాడుల గురించి ఎక్స్ (మునుపటి ట్విట్టర్) వేదికగా వివరించారు. "ఇలాంటివి గతంలో ఎప్పుడూ జరగలేదు. ఈ దాడుల వల్ల రష్యా తన వ్యూహాత్మక బాంబర్ల తయారీని కొనసాగించలేని స్థితిలోకి చేరింది. వారికి ఇది పెద్ద నష్టం" అని ఆమె వ్యాఖ్యానించారు. "రష్యాలో వ్యూహాత్మక బాంబర్లు భారీగా తగలబడుతున్నాయి" అని ఉక్రెయిన్ రహస్య సంస్థ ఎస్‌బీయూ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రత్యేక ఆపరేషన్‌ ప్రధానంగా రష్యా బాంబర్ విమానాలను ధ్వంసం చేయడం కోసమే నిర్వహించామని స్పష్టంచేసింది. ఉక్రెయిన్ లెక్కల ప్రకారం ఈ దాడుల వల్ల రష్యాకు దాదాపు 2 బిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక నష్టం వాటిల్లినట్లు అంచనా.

వివరాలు 

ఉక్రెయిన్ ప్రకటనలు - నష్టం విశ్లేషణ 

మర్మాన్‌స్క్ ప్రాంతం నుంచి తూర్పు సైబీరియాలోని అముర్ రీజియన్ వరకు, మధ్య రష్యాలోని ఇవనోవో, రియాజాన్ ప్రాంతాల వరకు ఉన్న వైమానిక స్థావరాలు లక్ష్యంగా దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో టీయూ-95 తరహా వ్యూహాత్మక బాంబర్లు, టీయూ-22ఎం3 తరహా సుదూర సూపర్ సోనిక్ బాంబర్లు, అలాగే ఏ-50 ముందస్తు హెచ్చరిక, నియంత్రణ సామర్థ్యం కలిగిన విమానాలు నాశనమైనట్లు ఉక్రెయిన్ వర్గాలు పేర్కొన్నాయి.

వివరాలు 

రష్యా ప్రతిస్పందన 

ఈ దాడుల్ని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా గుర్తించింది. మర్మాన్‌స్క్, ఇవనోవో, రియాజాన్, ఇర్కుట్స్క్, అముర్ ప్రాంతాల్లోని వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగాయని అంగీకరించింది. అయితే, తన వైమానిక బలగాలు ఈ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నాయని తెలిపింది. విమానాలకు కొంత భౌతిక నష్టం జరిగిందని రష్యా ఒప్పుకున్నా, వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఈ ఘటన నేపథ్యంలో ఉక్రెయిన్-రష్యా మధ్య ఉన్న ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉక్రెయిన్ చేపట్టిన ఈ వినూత్నమైన, ధైర్యసాహసాల నిండిన దాడి వ్యూహం అనేక దేశాల్లోని సైనిక నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.