Wisconsin: అమెరికాలో టోర్నడో బీభత్సం.. 3.9 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేత
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రాన్ని సోమవారం తీవ్ర టోర్నడో వణికించింది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా విస్కాన్సిన్‌తో పాటు అమెరికా మధ్య పశ్చిమ ప్రాంతంలోని పలు రాష్ట్రాల్లో 3.9లక్షలకుపైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా మెనాషా,యాపిల్‌టన్ నగరాలు టోర్నడో ప్రభావానికి తీవ్రంగా గురయ్యాయి. టోర్నడో బలానికి అనేక ఇళ్ల పైకప్పులు ఎగిరిపోగా,భారీ వృక్షాలు నేలకూలాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారుల వివరాల ప్రకారం టోర్నడో సుమారు 20నిమిషాల పాటు విధ్వంసం సృష్టించింది.
వివరాలు
పిడుగు పడి విద్యుత్ శాఖ ఉద్యోగి మృతి
ఇదే సమయంలో విస్కాన్సిన్‌లోని వైట్‌వాటర్ ప్రాంతంలో చెట్ల కొమ్మలను తొలగించే పనుల్లో నిమగ్నమైన విద్యుత్ శాఖ ఉద్యోగి పిడుగు పడి మృతి చెందాడు.
ఈ టోర్నడోను అత్యంత ప్రమాదకరమైనదిగా అమెరికా వాతావరణ శాఖ ప్రకటించింది.
నష్టం ఎంత మేరకు జరిగిందనే విషయాన్ని అధికారులు అంచనా వేస్తుండగా, శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుని ఉన్నారేమోనని సహాయక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, గ్రేట్ లేక్స్, ఒహాయో వ్యాలీ ప్రాంతాల్లో మరోసారి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అమెరికా వాతావరణ శాఖ హెచ్చరించింది.
ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేసింది.