Pa(c)k of lies: పాక్ ఎయిర్‌ఫోర్స్ ఏఐ మాయాజాలం.. భారత పార్లమెంట్‌ను ధ్వంసం చేశామంటూ వీడియో
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ మరోసారి తన ప్రచార తీరుతో నవ్వులపాలైంది. భారతదేశంపై సాధించినట్లు చెబుతున్న విజయాలను చూపించేందుకు ఏకంగా కృత్రిమమేధ(AI) సాయంతో ఓ భారీ గ్రాఫిక్స్ వీడియోను రూపొందించింది. భారత పార్లమెంట్ నుంచి సైనిక స్థావరాల వరకు అన్నింటినీ ధ్వంసం చేసినట్లు అందులో చూపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. 2025 మేలో జరిగిన 'ఆపరేషన్ సిందూర్' సందర్భంగా భారత్‌పై తాము చేసిన దాడుల తీవ్రతను ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ వీడియోను రూపొందించినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ డే సందర్భంగా'ఫిజాఓన్ కే పాస్బాన్'పేరుతో ఈ యానిమేషన్ వీడియోను విడుదల చేసింది. అయితే వీడియోలో చూపించిన దృశ్యాలకు మద్దతుగా నిజమైన ఫొటోలు,వీడియోలు లేదా ఇతర ప్రత్యక్ష ఆధారాలు కనిపించకపోవడం గమనార్హం.
వివరాలు
భారత్ కీలక రక్షణ వ్యవస్థలనే ధ్వంసం చేశామంటూ..
వీడియోలో పాకిస్థాన్ వైమానిక దళం చేసినట్లు చూపించిన దాడుల జాబితా చాలా పెద్దదిగానే ఉంది.
భారతదేశానికి చెందిన రెండు అత్యాధునిక S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు అందులో పేర్కొన్నారు.
అంతేకాదు.. భారత్‌కు చెందిన 32 ఎయిర్‌బేస్‌లపై దాడులు చేసి వాటిని తీవ్రంగా దెబ్బతీశామని చూపించారు.
ఇంతటితో ఆగకుండా భారత పార్లమెంట్, గుజరాత్‌లోని కాండ్లా పోర్ట్, ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై కూడా దాడులు చేసినట్లు వీడియోలో దృశ్యాలను సృష్టించారు.
ఉపగ్రహ వ్యవస్థలను జామ్ చేయడం, విద్యుత్ గ్రిడ్‌లను నిలిపివేయడం, దేశంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించడం, ఇంధన సరఫరాలను అడ్డుకోవడం వంటి చర్యలను కూడా తాము చేపట్టినట్లు అందులో పేర్కొన్నారు.
వివరాలు
భారత యుద్ధ విమానాలను కూల్చేశామంటూ..
నాలుగు రఫేల్ యుద్ధ విమానాలు, ఓ సుఖోయ్, మిగ్-29, మిరాజ్ 2000తో పాటు ఓ హెరాన్ డ్రోన్‌ను కూడా కూల్చివేసినట్లు పాకిస్థాన్ రూపొందించిన గ్రాఫిక్స్‌లో చూపించారు.
అయితే ఇలాంటి వాదనలకు బలం చేకూర్చేలా ఎలాంటి స్పష్టమైన ఆధారాలను మాత్రం ఆ దేశం బయటపెట్టలేకపోయింది.
ముఖ్యంగా 32 భారత ఎయిర్‌బేస్‌లపై దాడులు చేశామని చెప్పినప్పటికీ.. అక్కడి రన్‌వేలు, హ్యాంగర్లు లేదా ఇతర మౌలిక వసతులు ధ్వంసమైనట్లు చూపించే ఒక్క ఉపగ్రహ చిత్రాన్ని కూడా పాకిస్థాన్ వెల్లడించలేదు.
దీంతో పాక్ సైన్యం వద్ద వాస్తవ ఆధారాలు లేకపోవడం వల్లే ఏఐ రూపొందించిన దృశ్యాలను ప్రచారానికి ఉపయోగిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
సాక్ష్యాలతో భారత్.. ఏఐ గ్రాఫిక్స్‌తో పాక్..
ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ వెల్లడించిన సమాచారం,ఆధారాలను పరిశీలిస్తే పాకిస్థాన్ ప్రచారానికి భిన్నమైన దృశ్యం కనిపిస్తుందని విశ్లేషణలు చెబుతున్నాయి.
పాకిస్థాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు చేసినట్లు ప్రకటించడంతో పాటు,11 పాక్ సైనిక స్థావరాలపై దాడులకు సంబంధించిన దృశ్యాలను కూడా భారత్ ప్రపంచం ముందు ఉంచింది.
అంతర్జాతీయ ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్(OSINT) వర్గాలు,శాటిలైట్ చిత్రాలు కూడా భోలారీ,సర్గోధా, నూర్ ఖాన్ తదితర పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లకు జరిగిన నష్టాన్ని విశ్లేషించాయి.
1971 విముక్తి యుద్ధం తర్వాత పాకిస్థాన్ సైనిక మౌలిక సదుపాయాలపై భారత్ చేపట్టిన అతిపెద్ద దాడి ఇదేనని అమెరికాకు చెందిన'వాషింగ్టన్ పోస్ట్'కూడా కథనం ప్రచురించింది.
వివరాలు
S-400 ధ్వంసమైందన్న పాక్ వాదనకు చెక్..
ఈ నేపథ్యంలో.. భారత్ తన దాడులకు సంబంధించిన వాస్తవ ఆధారాలను చూపిస్తే, పాకిస్థాన్ మాత్రం గ్రాఫిక్స్, ఏఐ సృష్టించిన దృశ్యాలను చూపిస్తోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
పాకిస్థాన్ ప్రచారంలో అత్యంత కీలకమైన అంశంగా S-400 వ్యవస్థల ధ్వంసం అన్న వాదన కనిపించింది.
అయితే ఈ క్లెయిమ్‌ను భారత్ ఇప్పటికే ఖండించింది. ఆపరేషన్ సింధూర్ ముగిసిన కొద్ది రోజులకే ప్రధాని నరేంద్ర మోదీ ఆడంపూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌ను సందర్శించారు.
అక్కడ చెక్కుచెదరకుండా ఉన్న S-400 వ్యవస్థ ముందు నిలబడి ఆయన ప్రసంగించారు.
ఈ దృశ్యం పాకిస్థాన్ చేసిన S-400 ధ్వంసం వాదనకు గట్టి సమాధానంగా మారింది.
ఇటీవల డిస్కవరీ ఛానల్ 'డిక్లాసిఫైడ్: ఆపరేషన్ సింధూర్' పేరుతో రెండు భాగాల డాక్యుమెంటరీని ప్రసారం చేసింది.
వివరాలు
సోషల్ మీడియాలో పాక్ వీడియోపై సెటైర్లు..
ఇందులో ఆపరేషన్‌కు సంబంధించిన వాస్తవ దృశ్యాలతో పాటు పాకిస్థాన్‌కు జరిగిన నష్టాన్ని కూడా వివరంగా చూపించింది.
ఆ డాక్యుమెంటరీ వెలువడిన కొద్ది రోజులకే పాకిస్థాన్ తన ఏఐ వీడియోను విడుదల చేయడం ఇప్పుడు ఆ దేశానికే ఎదురుదెబ్బగా మారింది.
పాకిస్థాన్ విడుదల చేసిన ఈ కల్పిత గ్రాఫిక్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది.
వాస్తవ ఆధారాలు లేకుండా ఏఐ సాంకేతికతను ఉపయోగించి యుద్ధ విజయాలను సృష్టించడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
"వీడియో ఎడిటింగ్ పోటీ జరిగితే పాకిస్థాన్‌కే మొదటి బహుమతి వచ్చేది"అంటూ కొందరు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.
మరికొందరు.."పాకిస్థాన్‌కు రక్షణ బడ్జెట్ అవసరం లేదు..ఓ ఏఐ వీడియో జనరేటర్ ఉంటే చాలు. యూట్యూబ్‌లోనే యుద్ధాలు గెలిచేయొచ్చు" అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
వివరాలు
సోషల్ మీడియాలో పాక్ వీడియోపై సెటైర్లు..
మొత్తంగా, ఆపరేషన్ సింధూర్‌లో తాము సాధించిన విజయాలను చూపించాలనే ఉద్దేశంతో పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ రూపొందించిన ఈ ఏఐ వీడియో.. వాస్తవ ఆధారాల కంటే కల్పిత దృశ్యాలపైనే ఆధారపడిందనే విమర్శలను ఎదుర్కొంటోంది.
దీంతో పాక్ ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలోనే తీవ్రంగా వ్యంగ్యానికి గురవుతోంది.