Afghanistan: గగనతలంలో ఉద్రిక్తతలు: పాక్ యుద్ధవిమానం ఎఫ్-16 కూల్చేశామని అఫ్గాన్ ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇరుదేశాల సరిహద్దు ప్రాంతాల్లో భారీ స్థాయిలో కాల్పులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తమ గగనతలంలోకి చొరబడ్డ పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధవిమానాన్ని కూల్చివేశామని అఫ్గానిస్థాన్ ప్రకటించింది. ఆ దేశభద్రతా దళాల సమాచారాన్ని ఉదహరిస్తూ స్థానికమీడియా ఈ వార్తను ప్రసారం చేసింది. అదేవిధంగా, పాకిస్థాన్ యుద్ధవిమానం మంటల్లో కూరుకుపోయినట్లుగా కనిపిస్తున్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈఘటనపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ధృవీకరణ వెలువడలేదు. మరోవైపు,అఫ్గాన్ బలగాల చర్యలకు తమ సైన్యం సముచితంగా ప్రతిస్పందిస్తోందని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. ఏవిధమైన దురాక్రమణలైనా అణచివేసే శక్తి తమ సైన్యానికి ఉందని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
భారత్‌పై విమర్శలు చేసిన ఖవాజా ఆసిఫ్
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్‌పై విమర్శలు గుప్పించారు. అఫ్గానిస్థాన్ ఇప్పుడు భారతదేశ ప్రభావంలో ఉన్న ప్రాంతంగా మారిందని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా పోస్టు ద్వారా వెల్లడించారు. తాలిబన్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద శక్తులను ఒకచోట చేర్చి తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య శాంతి, స్థిరత్వం నెలకొల్పేందుకు సౌహార్దపూర్వక ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పిన ఆయన, అఫ్గానిస్థాన్ మాత్రం భారతదేశ ప్రతినిధిలా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌పై జరుగుతున్న దాడులకు తమ బలగాలు కఠినంగా ప్రతిదాడులు చేస్తున్నాయని ఆయన వెల్లడించారు.