Abraham Accords: ఇజ్రాయెల్‌తో చేతులు కలిపితే పాక్ పాస్‌పోర్ట్ మారాల్సిందేనా..?
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ పాస్‌పోర్ట్‌పై కనిపించే "ఇజ్రాయెల్‌కు చెల్లదు" అనే నిబంధన ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. దీనికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన ప్రతిపాదనే. పశ్చిమాసియాలో శాంతి ఒప్పందాలను మరింత విస్తరించాలంటే పాకిస్థాన్ కూడా ఇజ్రాయెల్‌తో సంబంధాలు సాధారణ స్థితికి తీసుకురావాలని ఆయన సూచించడంతో కొత్త చర్చ మొదలైంది. దీంతో "పాకిస్థాన్ తన పాస్‌పోర్ట్ నిబంధనలను మార్చాల్సి వస్తుందా?" అనే ప్రశ్న ముందుకొచ్చింది. అమెరికా ఆధ్వర్యంలో అమలవుతున్న "అబ్రహాం ఒప్పందాలు" మరిన్ని దేశాలకు విస్తరించాలని ట్రంప్ కోరుతున్నారు. ఈ క్రమంలో సౌదీ అరేబియా, ఖతర్, టర్కీతో పాటు పాకిస్థాన్ కూడా ఈ ఒప్పందాల్లో భాగం కావాలని ఆయన అభిప్రాయపడ్డారు.
వివరాలు
ఇజ్రాయెల్‌పై మాకు నమ్మకం లేదు: ఖ్వాజా ఆసిఫ్
పశ్చిమాసియాలో శాంతి,ఆర్థిక భాగస్వామ్యం,వ్యూహాత్మక సహకారం పెరగాలంటే ముస్లిం దేశాలు ఇజ్రాయెల్‌తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని ట్రంప్ పేర్కొన్నారు. "ఈ ఒప్పందాల్లో భాగం కావడానికి నిరాకరించే దేశాలు భవిష్యత్తు చర్చల్లో వెనుకబడే ప్రమాదం ఉంది" అని కూడా స్పష్టం చేశారు. అయితే పాకిస్థాన్ మాత్రం ఈ ప్రతిపాదనను వెంటనే తిరస్కరించింది. పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ... "ఇజ్రాయెల్‌పై మాకు నమ్మకం లేదు. పాలస్తీనా సమస్యకు పరిష్కారం రాకుండా మేం గుర్తింపు ఇవ్వం" అని తేల్చిచెప్పారు. ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాఖ్ దార్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. 1967 సరిహద్దుల ప్రకారం స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పడితేనే ఇజ్రాయెల్‌ను గుర్తించే అంశాన్ని పరిశీలిస్తామని పాకిస్థాన్ చెబుతోంది.
వివరాలు
అబ్రహాం ఒప్పందాలు అంటే ఏమిటి?
2020లో అమెరికా మధ్యవర్తిత్వంలో ఇజ్రాయెల్,కొన్ని అరబ్ దేశాల మధ్య కుదిరిన సంబంధాల సాధారణీకరణ ఒప్పందాలకే "అబ్రహాం ఒప్పందాలు" అని పేరు. యూదులు,ముస్లింలు,క్రైస్తవులకు పితామహుడిగా భావించే "అబ్రహాం" పేరునే వీటికి పెట్టారు. వాణిజ్యం, పర్యాటకం, సాంకేతికత, భద్రతా సహకారం వంటి రంగాల్లో పరస్పర సంబంధాలు పెంపొందించడం వీటి ప్రధాన లక్ష్యం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, మొరాకో వంటి దేశాలు ఇప్పటికే ఈ ఒప్పందాల్లో చేరి ఇజ్రాయెల్‌తో ప్రత్యక్ష దౌత్య, వాణిజ్య సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాయి. విమాన సర్వీసులు, పర్యాటకం, వ్యాపారం, సాంకేతిక రంగాల్లో ఈ ఒప్పందాలు గణనీయమైన మార్పులు తీసుకొచ్చాయి. అయితే పాలస్తీనా సమస్యకు పరిష్కారం రాకముందే అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌తో చేతులు కలపడం పశ్చిమాసియా రాజకీయాల్లో చారిత్రక మలుపుగా భావించబడింది.
వివరాలు
పాస్‌పోర్ట్‌పై ఉన్న నిబంధనే ఇప్పుడు చర్చ
ప్రస్తుతం పాకిస్థాన్ పాస్‌పోర్ట్‌పై "ఇజ్రాయెల్‌కు మినహా ప్రపంచంలోని అన్ని దేశాలకు ఈ పాస్‌పోర్ట్ చెల్లుతుంది" అనే నిబంధన స్పష్టంగా ముద్రించబడి ఉంటుంది. అంటే ప్రపంచ దేశాలకు ఈ పాస్‌పోర్ట్ చెల్లుబాటు అయినప్పటికీ ఇజ్రాయెల్‌కు మాత్రం కాదు. ఒకవేళ పాకిస్థాన్ ఇజ్రాయెల్‌తో అధికారిక సంబంధాలు ఏర్పరుచుకుంటే అదే సమయంలో తమ పౌరులు అక్కడికి వెళ్లకూడదని చెప్పే నిబంధన కొనసాగించడం చట్టపరంగా విరుద్ధంగా మారుతుంది. దౌత్య సంబంధాలు, వీసా విధానాలు, వాణిజ్య ఒప్పందాలు, రాయబార కార్యాలయాల ఏర్పాటు వంటి వ్యవస్థలు అమల్లోకి రావాలంటే ఈ నిబంధనను తొలగించాల్సిందే.
వివరాలు
చరిత్రలోకి వెళ్లితే...
1947లో భారత విభజన తర్వాత ముస్లింల కోసం ప్రత్యేక దేశంగా పాకిస్థాన్ ఏర్పడింది. ఆ తర్వాత 1948లో ఇజ్రాయెల్ దేశం ఏర్పడడంతో పాలస్తీనా భూభాగాలపై వివాదం మొదలైంది. అప్పటి నుంచే పాలస్తీనాకు మద్దతుగా నిలిచిన పాకిస్థాన్... ఇజ్రాయెల్‌ను అధికారిక దేశంగా గుర్తించబోమని ప్రకటించింది. అదే విధానంలో భాగంగా పాస్‌పోర్ట్‌లపై "ఇజ్రాయెల్‌కు చెల్లదు" అనే నిబంధన ముద్రించడం ప్రారంభించింది. 1950ల చివర నుంచి 1960ల నాటికి ఈ విధానం అధికారికంగా స్థిరపడినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఇది కేవలం పాకిస్థాన్‌కే పరిమితం కాలేదు. అరబ్-ఇజ్రాయెల్ యుద్ధాల తర్వాత అనేక ముస్లిం దేశాలు కూడా ఇలాంటి ఆంక్షలనే అమలు చేశాయి. బంగ్లాదేశ్,మలేషియా,బ్రూనై,ఇరాన్,సిరియా, లెబనాన్, కువైట్ వంటి దేశాలు కూడా ఒకప్పుడు ఇజ్రాయెల్‌పై ఇలాంటి నిషేధాలను అమలు చేశాయి.
వివరాలు
బంగ్లాదేశ్ తీసుకున్న నిర్ణయం
కాలక్రమేణా ప్రపంచ రాజకీయాలు మారడంతో అనేక దేశాలు ఇజ్రాయెల్‌తో సంబంధాలు పెంచుకున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని దేశాలు తమ పాస్‌పోర్ట్‌లలోని ఆ నిబంధనలను తొలగించాయి. బంగ్లాదేశ్ ఇందుకు ప్రధాన ఉదాహరణగా నిలిచింది. అక్కడ కూడా చాలాకాలం పాటు "ఇజ్రాయెల్‌కు మినహా" అనే వాక్యం ఉండేది. కానీ ఆధునిక ఈ-పాస్‌పోర్ట్‌లను ప్రవేశపెట్టే సమయంలో ఆ నిబంధనను తొలగించారు. అయినప్పటికీ ఇజ్రాయెల్‌ను అధికారికంగా గుర్తించలేదనే తమ వైఖరిలో మార్పు లేదని బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం కూడా పాకిస్థాన్, ఇరాన్ వంటి కొన్ని దేశాలు ఇజ్రాయెల్‌పై కఠిన వైఖరినే కొనసాగిస్తున్నాయి. పాలస్తీనాకు స్వతంత్ర దేశ హోదా లభించే వరకు ఇజ్రాయెల్‌ను గుర్తించే ప్రసక్తే లేదని పాకిస్థాన్ స్పష్టంగా చెబుతోంది.
వివరాలు
పాకిస్థాన్ ముందు ఉన్న సవాళ్లు
ఒకవేళ పాకిస్థాన్ కూడా బంగ్లాదేశ్ తరహాలో ముందుకెళ్తే ముందుగా పాస్‌పోర్ట్‌లను మార్చాల్సి వస్తుంది. ప్రస్తుతం ఉన్న "ఇజ్రాయెల్‌కు మినహా" అనే నిబంధన తొలగించాలంటే కొత్త నమూనా పాస్‌పోర్ట్‌లు ముద్రించాలి. లక్షలాది పాస్‌పోర్ట్‌లను దశలవారీగా మార్చాల్సి రావచ్చు. ఇది భారీ ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. అదే సమయంలో వీసా విధానాలు, వలస నిబంధనలు, విమాన సర్వీసులు, రాయబార కార్యాలయాల ఏర్పాటు వంటి అనేక రంగాల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. రెండు దేశాల మధ్య అధికారిక ప్రయాణాలు ప్రారంభమైతే చట్టపరమైన సవరణలు కూడా తప్పవు.
వివరాలు
రాజకీయ ప్రభావం ఎలా ఉంటుంది?
అసలు సవాలు రాజకీయంగానే ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే పాకిస్థాన్‌లో పాలస్తీనా అంశం ప్రజల భావోద్వేగాలకు సంబంధించినది. ఇజ్రాయెల్‌ను గుర్తించడం అంటే "దశాబ్దాలుగా కొనసాగుతున్న విధానానికి విరుద్ధం" అని మతపరమైన, రాజకీయ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. ముఖ్యంగా మతపరమైన పార్టీలు, కఠినవాద సంస్థలు దీన్ని పెద్ద రాజకీయ అంశంగా మార్చవచ్చు. మరోవైపు సైన్యం,విదేశాంగ వ్యవస్థ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.
వివరాలు
రాజకీయ ప్రభావం ఎలా ఉంటుంది?
ఎందుకంటే ఇరాన్ వంటి దేశాలతో సంబంధాలపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చేవారు మాత్రం వేరే వాదన వినిపిస్తున్నారు. ఇజ్రాయెల్‌తో సంబంధాలు ఏర్పడితే సాంకేతికత, వ్యవసాయం, భద్రత, వాణిజ్య రంగాల్లో ప్రయోజనాలు లభిస్తాయని వారు చెబుతున్నారు. మధ్యప్రాచ్య దేశాలతో ఆర్థిక భాగస్వామ్యం కూడా మరింత బలపడుతుందని అభిప్రాయపడుతున్నారు. అందుకే... ఇది కేవలం పాస్‌పోర్ట్‌పై ఉన్న ఒక వాక్యాన్ని తొలగించే విషయం మాత్రమే కాదు. పాకిస్థాన్ దశాబ్దాలుగా అనుసరిస్తున్న రాజకీయ, దౌత్య విధానాల్లో పెద్ద మార్పుకు దారితీసే నిర్ణయంగా మారే అవకాశం కనిపిస్తోంది.