Pak TV anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ దారుణ హత్య.. భర్త అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌లో మహిళలపై హింసకు సంబంధించిన మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ టెలివిజన్ యాంకర్, ప్రోగ్రామ్ హోస్ట్ రాబియా ఎహసాన్ (41) తుపాకీ కాల్పుల్లో మృతి చెందారు. రావల్పిండిలోని గుల్షన్‌బాద్ ప్రాంతంలో ఆదివారం ఆమె తన నివాసంలోనే విగతజీవిగా కనిపించారు. ఈ ఘటన పాకిస్థాన్ మీడియా వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఆమె హత్య వెనుక భర్త ఎహసాన్ తాహిర్ ఖాన్ హస్తం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు రాబియా భర్తను అదుపులోకి తీసుకున్నట్లు పాకిస్థాన్‌కు చెందిన సమా ఛానల్ వెల్లడించింది. సిటీ పోలీస్ ఆఫీసర్ (సీపీఓ) హసన్ ముష్తాక్ సుఖేరా మాట్లాడుతూ.. అనుమానాస్పద ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామని, కేసు దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.
వివరాలు
పిస్టల్ స్వాధీనం
సీనియర్ పోలీసు అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఇంట్లో పనిచేసే పురుష ఉద్యోగి అందించిన సమాచారం ప్రకారం.. కాల్పులు ప్రమాదవశాత్తు జరిగాయని రాబియా భర్త చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.
మరోవైపు, దర్యాప్తులో భాగంగా పోలీసులు ఓ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
రాబియాపై కాల్పులకు ఈ ఆయుధాన్నే ఉపయోగించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
పోలీసుల విచారణలో ఎహసాన్ తాహిర్ ఖాన్ తన వాదనను వినిపించినట్లు డాన్ వార్తా సంస్థ పేర్కొంది.
తాను పిస్టల్ పట్టుకుని ఉండగా అది అనుకోకుండా పేలిందని, అందులో బుల్లెట్ లోడ్ చేసి ఉందనే విషయం తనకు తెలియదని చెప్పినట్లు తెలిపింది.
వివరాలు
పోస్టుమార్టం కోసం రాబియా మృతదేహం
అయితే, రాబియా మృతి ప్రమాదవశాత్తు జరిగిన కాల్పుల వల్ల సంభవించిందా? లేక ఉద్దేశపూర్వకంగా ఆమెపై కాల్పులు జరిపారా? అనే విషయాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
పంజాబ్ ఫోరెన్సిక్ సైన్స్ ఏజెన్సీ (PFSA) నిపుణుల బృందాలు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నాయి.
మరోవైపు, రాబియా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
కేసు నమోదు ప్రక్రియ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
రాబియా ఎహసాన్‌కు 41 ఏళ్లు. ఆమె పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ ప్రైవేట్ టెలివిజన్ ఛానల్ 92 న్యూస్‌లో యాంకర్‌గా, ప్రోగ్రామ్ హోస్ట్‌గా పనిచేశారు.
వివరాలు
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పాకిస్థాన్ ఫస్ట్ లేడీ
సీనియర్ జర్నలిస్టులు అమీర్ మతీన్,రౌఫ్ క్లాస్రాలతో కలిసి కరెంట్ అఫైర్స్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.
ఆమెకు 13, 11 ఏళ్ల వయస్సున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాల్పుల ఘటన జరిగిన సమయంలో పిల్లలు తమ అమ్మమ్మతో కలిసి ఇంటి లాన్‌లో ఉన్నట్లు డాన్ తన కథనంలో వెల్లడించింది.
రాబియా ఎహసాన్ హత్య ఘటనపై పాకిస్థాన్ ఫస్ట్ లేడీ ఆసిఫా భుట్టో జర్దారీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మహిళలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలను తీవ్రంగా ఖండించారు.
ఈ కేసులో ఎలాంటి పక్షపాతం లేకుండా పూర్తిస్థాయిలో, పారదర్శకంగా దర్యాప్తు జరపాలని అధికారులను కోరారు.
ఘటన వెనుక ఉన్న వాస్తవాలు బయటకు రావాలని, బాధ్యులుగా తేలిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.