Loading...
Pakistan: పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం.. నలుగురు మృతి, 30 మందికి గాయాలు
పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం.. నలుగురు మృతి, 30 మందికి గాయాలు

Pakistan: పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం.. నలుగురు మృతి, 30 మందికి గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 13, 2026
11:04 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లో మంగళవారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. పంజాబ్ ప్రావిన్స్‌లోని షేర్ షా నగరం సమీపంలో ఓ ప్రయాణికుల రైలు పట్టాలు తప్పింది. కరాచీ నుంచి పెషావర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 30 మంది గాయపడ్డారు. రైల్వే అధికార ప్రతినిధి కలీమ్ అఖ్తర్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ తెలిపింది. ప్రమాద స్థలం నుంచి సహాయక బృందాలు నలుగురి మృతదేహాలను వెలికితీశాయి.

వివరాలు 

రైలులోని 14 బోగీల నుంచి క్షతగాత్రుల తరలింపు

ప్రమాదానికి గురైన రైలులోని 14 బోగీల నుంచి గాయపడిన ప్రయాణికులను బయటకు తీసుకొచ్చి, చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

సహాయక సిబ్బంది, వైద్య బృందాలు కూడా ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.

ఈ ఘటనపై పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను వేర్వేరు ప్రకటనల్లో ఆదేశించారు.

వివరాలు 

2023లో రైలు ప్రమాదం.. 30 మంది మృతి

పాకిస్థాన్‌లో రైల్వే వ్యవస్థలో పెట్టుబడుల కొరత, పాతబడిన మౌలిక సదుపాయాల కారణంగా గతంలోనూ అనేక ప్రమాదాలు జరిగాయి.

ముఖ్యంగా రైల్వే ట్రాక్‌లు, సిగ్నలింగ్ వ్యవస్థలు పాతబడటం ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

2023లో దక్షిణ పాకిస్థాన్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

ఓ ప్రయాణికుల రైలుకు చెందిన 10 బోగీలు పట్టాలు తప్పడంతో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 90 మందికి పైగా గాయపడ్డారు.

ADVERTISEMENT