Indus Water Treaty: సింధూ జలాలపై భారత్‌కు పాక్ హెచ్చరిక.. యుద్ధ చర్యగా పరిగణిస్తామన్న సైన్యం
ఈ వార్తాకథనం ఏంటి
సింధూ జలాల ఒప్పందం (Indus Waters Treaty-IWT) అమలును భారత్ నిలిపివేసిన నేపథ్యంలో పాకిస్థాన్ మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఒప్పందం ప్రకారం తమ దేశానికి రావాల్సిన సింధూ జలాల వాటాను సాధించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పాకిస్థాన్ సైన్యం ప్రకటించింది. పాక్ సైన్యానికి చెందిన 276వ కోర్ కమాండర్ల సమావేశం ఆ దేశ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ఆదేశాలు, దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సింధూ జలాల హక్కుల పరిరక్షణ కోసం కట్టుబడి ఉంటామని సైన్యం స్పష్టం చేసింది.
వివరాలు
పాకిస్థాన్ దృష్టిలో నీటి వనరులు దేశ జాతీయ భద్రతలో కీలక అంశం
అలాగే 2025 ఏప్రిల్ 24న జాతీయ భద్రతా కమిటీ (NSC) జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సింధూ జలాల ప్రవాహాన్ని అడ్డుకునే ఏ చర్యనైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని మరోసారి పేర్కొంది. పాకిస్థాన్ దృష్టిలో నీటి వనరులు దేశ జాతీయ భద్రతలో కీలక అంశమని సైన్యం తెలిపింది. సింధూ జలాల ఒప్పందం ఇప్పటికీ చట్టబద్ధంగా అమల్లోనే ఉందని, దానిని ఏకపక్షంగా రద్దు చేసే అధికారం ఎవరికీ లేదని భారత్‌పై విమర్శలు చేసింది. ఇక భద్రతా పరిస్థితులపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. తాలిబన్ల నియంత్రణలో ఉన్న అఫ్గానిస్థాన్ భూభాగాన్ని ఉపయోగించుకుని ఉగ్రవాద సంస్థలు పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాలపై దాడులకు పాల్పడుతున్నాయని సైన్యం ఆందోళన వ్యక్తం చేసింది.
వివరాలు
పహల్గాం ఉగ్రదాడి అనంతరం సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన భారత్
ఉగ్రవాద ముప్పు నుంచి దేశ ప్రజలను రక్షించేందుకు తమ సాయుధ దళాలు నిరంతరం చర్యలు చేపడుతున్నాయని వెల్లడించింది. అలాగే కశ్మీర్ ప్రజలకు పాకిస్థాన్ మద్దతు కొనసాగుతుందని మరోసారి పునరుద్ఘాటించింది. సింధు నది, దాని ఉపనదుల జలాల పంపిణీకి సంబంధించి భారత్, పాకిస్థాన్‌ల మధ్య ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వంలో 1960లో సింధూ జలాల ఒప్పందం కుదిరింది. అయితే పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ మాట్లాడుతూ, 2028 జూన్ నాటికి సింధు నదీ జలాల ప్రవాహాన్ని పాకిస్థాన్‌కు పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల అనంతరం పాకిస్థాన్‌కు చెందిన మంత్రులు, అధికారులు వరుసగా స్పందిస్తూ భారత్‌పై ఆరోపణలు చేస్తున్నారు.