Pakistan: క్వెట్టా సమీపంలో ఘోర ప్రమాదం.. బొగ్గు గనిలో పేలుడు.. 32 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌లోని బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించి తీవ్ర విషాదానికి దారితీసింది. ఈ ప్రమాదంలో 32 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు భూగర్భంలో చిక్కుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు. క్వెట్టా సమీపంలోని సోరేంజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం గనిలో మీథేన్ వాయువు అధికంగా పేరుకుపోవడంతో పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో గని లోపల మొత్తం 36 మంది కార్మికులు పనిచేస్తున్నారని వెల్లడించారు.
వివరాలు
భవనం కూలి.. 11 మంది మృతి
పేలుడు తీవ్రతకు రెండుగనులు పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం.
ఇంకా కొందరు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండొచ్చనే అనుమానంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇదిలా ఉండగా,గనుల్లో తగిన భద్రతా ప్రమాణాలను యజమానులు అమలు చేయకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు.
భద్రతాచర్యల లోపాన్ని వెంటనే సరిదిద్దాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
మరోవైపు పాకిస్థాన్‌లో మరో విషాదఘటన చోటుచేసుకుంది.
లాహోర్‌లోని హర్బన్స్‌పురా ప్రాంతంలో మూడు అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో 11మంది మృతి చెందారు.
ఈ ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
భవనం కూలిపోవడానికి గల అసలు కారణాలను అధికారులు ఇంకా గుర్తించాల్సి ఉంది.