పాకిస్థాన్ లో సార్వత్రిక ఎన్నికలు.. ఇవాళ రాజీనామా చేయనున్న ప్రధాని షెహబాజ్ షరీఫ్
పాకిస్థాన్‌లో 2023 ఆఖర్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అదనపు సమయాన్ని పొందేందుకు పాక్ ప్రభుత్వం యోచిస్తోంది. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని సంకీర్ణ సర్కారు నేషనల్ అసెంబ్లీ(పార్లమెంట్)ను రద్దు చేసే దిశగా పయనిస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ షెహబాజ్ ప్రధాని పదవి నుంచి తప్పుకోనున్నట్లు సమాచారం. మరో మూడు రోజుల్లో - ఆగస్ట్ 12న పార్లమెంట్ దిగువసభ (ప్రజల సభ) పదవీ కాలం ముగియనుంది. ఈ సందర్భంగా బుధవారం జాతీయ అసెంబ్లీని రద్దు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రెసిడెంట్ నిర్ణయం తీసుకోకుంటే 48 గంటల్లో పార్లమెంట్ రద్దు
ఈ క్రమంలోనే పాకిస్థాన్ అధ్యక్షుడు అరిఫ్ అల్వీకి, ప్రధాని షెహబాజ్ రద్దు నిర్ణయంపై సమాచారాన్ని పంపించనున్నారు. ఒకవేళ పాక్ ప్రెసిడెంట్ కనుక రద్దు అంశంపై వేగంగా నిర్ణయం తీసుకోకపోతే 48 గంటల్లో పార్లమెంట్ రద్దు అవుతుంది. మరోవైపు షెహబాజ్ మంగళవారం రావల్పిండిలోని ఆర్మీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ అసిం మునీర్ ప్రధానికి ఘన స్వాగతం పలికారు. ఇవాళ ప్రధాన మంత్రి రాజీనామా చేస్తే షెహబాజ్ సారథ్యంలోని ముస్లిం లీగ్ నవాజ్ సంకీర్ణ సర్కారు మరో రెండు రోజులు అధికారంలో ఉండనుంది. ఈ మేరకు ఆగస్ట్ 11 వరకు ఆపద్ధర్మ ప్రధానిగా విధులు నిర్వర్తించే అవకాశం ఉంది.