Pakistan: పాకిస్థాన్‌లో ఫ్రెంచ్ మహిళకు 12 ఏళ్ల గృహ నిర్బంధం.. గుట్టు విప్పిన కుమారుడి సాహసం!
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌లో ఫ్రాన్స్‌కు చెందిన ఓ మహిళ 12 ఏళ్లుగా భర్త చేతిలో గృహ నిర్బంధానికి గురైన ఘటన సంచలనంగా మారింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు సమీపంలోని బారా ప్రాంతంలో నివసిస్తున్న 54 ఏళ్ల సిల్వీ యాస్మినాతో పాటు ఆమె ఐదుగురు పిల్లలను పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఎన్నో ఏళ్లుగా ఆమె కుటుంబం బయటి ప్రపంచానికి పూర్తిగా దూరంగా ఉండటం ఈ ఘటన తీవ్రతను వెల్లడిస్తోంది. ఈ నెల 18న అందిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. యాస్మినా కుమారుల్లో ఒకరు ఎలాగోలా ఇంటి నుంచి బయటకు వచ్చి పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాలు
ఆస్ట్రేలియాలో పరిచయం.. పాకిస్థాన్‌లో బందీ జీవితం
వెంటనే జిల్లా పోలీసు చీఫ్ వకార్ అహ్మద్ నేతృత్వంలోని బృందం బారాలోని మట్టి ఇటుకల ఇంటిపై దాడి చేసి మహిళతో పాటు పిల్లలను రక్షించింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. 2000వ దశకం ప్రారంభంలో ఆస్ట్రేలియాలో ఓ పాకిస్థాన్ వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అనంతరం ఇద్దరూ వివాహం చేసుకున్నారు. 2014 నుంచి పాకిస్థాన్‌లోని బారా ప్రాంతంలో నివసిస్తున్న సమయంలో భర్త తనను, పిల్లలను పూర్తిగా గృహ నిర్బంధంలో ఉంచాడని యాస్మినా ఆరోపించింది. గత 12 ఏళ్లుగా బయటివారితో ఎలాంటి సంబంధాలు లేకుండా ఉంచడమే కాకుండా, ప్రతిరోజూ శారీరకంగా, మానసికంగా వేధించేవాడని పోలీసులకు వివరించింది. పాకిస్థాన్‌లో జన్మించిన పిల్లలను కనీసం పాఠశాలకు కూడా పంపించలేదని వెల్లడించింది.
వివరాలు
భర్త అరెస్ట్.. పిల్లలకు రక్షణ
యాస్మినా ఫిర్యాదు మేరకు ఆమె భర్త అహ్మద్ ఖాన్‌పై గృహ హింస, అక్రమ నిర్బంధం కేసులు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం బాధిత మహిళతో పాటు ఐదుగురు పిల్లలను పెషావర్‌లోని మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించి రక్షణ కల్పించారు. చాలా కాలంగా గృహ నిర్బంధంలో ఉండటంతో పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారిలో ఒకరికి వినికిడి, మాట్లాడే సామర్థ్యానికి సంబంధించిన సమస్యలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం యాస్మినా తన పిల్లలతో కలిసి తిరిగి ఫ్రాన్స్ వెళ్లేందుకు అధికారుల సహాయం కోరుతోంది.