Picasso Painting: లక్షల్లో కాదు.. కోట్ల పికాసో చిత్రం.. వేలల్లోనే సొంతం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పాబ్లో పికాసో అభిమానికి అరుదైన అనుభవం ఎదురైంది. పికాసో రూపొందించిన రూ.9.3 కోట్ల విలువైన చిత్రం అతనికి కేవలం 100 యూరోలు (సుమారు రూ.11 వేలు)కే దక్కింది. ఈ అనూహ్య సంఘటనతో అతడు ఆనందంతో మునిగిపోయాడు. ఈ విశేషం ఎలా జరిగిందంటే.. అల్జీమర్స్ పరిశోధనా సంస్థ పరిశోధనలకు నిధులు సమీకరించేందుకు '100 యూరోలకే ఒక పికాసో చిత్రం' అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1.20 లక్షల టికెట్లు విక్రయించారు.
వివరాలు
1941లో పికాసో ఈ చిత్రాన్ని రూపొందించారు
అనంతరం, క్రిస్టీస్ వేలంపాట సంస్థలో ఆన్‌లైన్ డ్రా ద్వారా చీటీ తీసే కార్యక్రమం నిర్వహించారు. ఈ డ్రాలో పారిస్‌కు చెందిన విక్రయ విభాగంలో పనిచేస్తున్న అరీ హోదారా (58)కు అదృష్టం కలిసొచ్చింది. దీంతో అతనికి రూ.11 వేలకే ఆ అమూల్య చిత్రం లభించింది. ఈ విషయాన్ని నిర్వాహకులు ఫోన్ ద్వారా తెలియజేసినప్పుడు మొదట నమ్మలేకపోయానని, ఎవరో సరదాగా మాట్లాడుతున్నారని అనుకున్నానని అరీ హోదారా తెలిపారు. 'ఒక మహిళ ముఖచిత్రం' అనే పేరుతో 1941లో పికాసో ఈ చిత్రాన్ని రూపొందించారు. తన దీర్ఘకాల సహచరురాలు డోరా మార్ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని ఆయన ఆవిష్కరించారు.