Nepal: నేపాల్‌లో ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పిన విమానం
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పింది. భద్రాపూర్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న బుద్ధ ఎయిర్‌కు చెందిన ఏటీఆర్-72 విమానం అదుపు తప్పి రన్‌వేను దాటి ముందుకు దూసుకెళ్లింది. చివరకు ఒక నది ఒడ్డున విమానం ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఖాట్మండ్ నుంచి భద్రాపూర్‌కు బయల్దేరిన ఈ టర్బోప్రాప్ ప్యాసింజర్ విమానంలో మొత్తం 51 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు.
Details
నది ఒడ్డున విమానం ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది
భద్రాపూర్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ సమయంలో ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయిన విమానం రన్‌వేను దాటుకుని భూమిపైకి దూసుకెళ్లింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక హడలెత్తిపోయారు. కొంత దూరం వెళ్లిన అనంతరం నది ఒడ్డున విమానం ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది, విమానాశ్రయ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. విమానంలోని ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
Details
ఘటనపై అధికారుల దర్యాప్తు
ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊరట చెందారు. అయితే విమానం మాత్రం స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు ఖాట్మండ్ నుంచి సాంకేతిక, సహాయ బృందాలను పంపినట్లు బుద్ధ ఎయిర్ సంస్థ వెల్లడించింది. ప్రాథమిక విచారణలో వాతావరణ సంబంధిత సమస్యలు గానీ, స్పష్టమైన సాంకేతిక లోపాలు గానీ ఏవీ లేనట్లు తెలిసింది. ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నదానిపై అధికారులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.