LOADING...
Ryanair Flight: గాల్లో ఉండగా పగిలిన విమానం కిటికీ.. సగం బయటకు వెళ్లిన ప్రయాణికుడు!
గాల్లో ఉండగా పగిలిన విమానం కిటికీ.. సగం బయటకు వెళ్లిన ప్రయాణికుడు!

Ryanair Flight: గాల్లో ఉండగా పగిలిన విమానం కిటికీ.. సగం బయటకు వెళ్లిన ప్రయాణికుడు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 10, 2026
05:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్రీస్‌ నుంచి జర్మనీకి బయల్దేరిన ర్యాన్‌ఎయిర్‌కు చెందిన ఓ విమానంలో ఉత్కంఠభరిత ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా కిటికీ పగిలిపోవడంతో దాని పక్కనే కూర్చున్న ఓ ప్రయాణికుడు గాలి వేగానికి సగం వరకు విమానం వెలుపలికి వెళ్లిపోయాడు. అదృష్టవశాత్తూ తోటి ప్రయాణికుల అప్రమత్తతతో అతడి ప్రాణాలు దక్కాయి.

వివరాలు 

ఇంజిన్‌ భాగం ఊడి కిటికీపై పడింది

శుక్రవారం ఉదయం గ్రీస్‌లోని థెసలనికి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జర్మనీకి ర్యాన్‌ఎయిర్‌ విమానం బయల్దేరింది. టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఆ సమయంలో ఇంజిన్‌లోని ఓ భాగం విడిపోయి విమానం కిటికీని బలంగా ఢీకొట్టింది. దాంతో కిటికీ పూర్తిగా ధ్వంసమైంది. వెంటనే క్యాబిన్‌లో గాలి పీడనం తగ్గిపోవడంతో అత్యవసర ఆక్సిజన్‌ మాస్క్‌లు స్వయంచాలకంగా బయటకు వచ్చాయి.

వివరాలు 

గాలి వేగానికి సగం బయటకు వెళ్లిన ప్రయాణికుడు

పగిలిన కిటికీ పక్కనే కూర్చున్న 61 ఏళ్ల ప్రయాణికుడు ఒక్కసారిగా గాలి ఒత్తిడికి సగం వరకు విమానం వెలుపలికి లాగబడ్డాడు. కొన్ని క్షణాల పాటు అతడి శరీరంలోని పైభాగం విమానం బయటే ఉండటంతో పరిస్థితి అత్యంత భయానకంగా మారింది. వెంటనే అతడి పక్కనే కూర్చున్న భార్యతో పాటు ఇతర ప్రయాణికులు అప్రమత్తమై అతడిని బలంగా వెనక్కి లాగడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనలో అతడి తల, భుజాలకు తీవ్ర గాయాలయ్యాయి.

Advertisement

వివరాలు 

వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించిన పైలట్లు

ప్రమాద తీవ్రతను గుర్తించిన పైలట్లు ఆలస్యం చేయకుండా విమానాన్ని తిరిగి గ్రీస్‌లోని విమానాశ్రయానికి మళ్లించారు. అక్కడ అత్యవసరంగా ల్యాండ్‌ చేసిన అనంతరం గాయపడిన ప్రయాణికుడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రయాణికుల్లో భయాందోళన ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయానికి గురయ్యారు. బాంబు పేలినట్లుగా ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించిందని, వెనక్కి తిరిగి చూడగా ఓ వ్యక్తి సగం వరకు పగిలిన కిటికీ నుంచి బయటకు వెళ్లిపోయి కనిపించాడని పలువురు ప్రయాణికులు తెలిపారు. ఈ ఘటనను ర్యాన్‌ఎయిర్‌ సంస్థ ధ్రువీకరిస్తూ, ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించింది.

Advertisement