Singapore: ఈ దేశ ప్రధాని జీతం ఏడాదికి రూ.27 కోట్లు.. ప్రపంచంలోనే అత్యధిక వేతనం ఆయనదే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోనే అత్యధిక వేతనం అందుకుంటున్న ప్రధానిగా ఉన్న సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌కు మరోసారి జీతం పెరగనుంది. ఆ దేశ రాజకీయ నాయకుల వేతనాలను 60 శాతానికి పైగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం వెల్లడించడంతో.. లారెన్స్ వాంగ్ వార్షిక వేతనం భారీగా పెరగనుంది. ప్రస్తుతం సింగపూర్ ప్రధాని ఏడాదికి సుమారు రూ.16.5 కోట్ల వేతనం అందుకుంటున్నారు. తాజా పెంపుతో ఆయన జీతం రూ.27 కోట్లకు చేరనుంది. అంటే ప్రధాని వార్షిక వేతనంలో భారీగా పెరుగుదల చోటుచేసుకోనుంది.
వివరాలు
ఉప ప్రధాని జీతం కూడా కోట్లలోనే..
సింగపూర్ ఉప ప్రధాని వార్షిక వేతనం 3.06 మిలియన్ సింగపూర్ డాలర్లుగా ఉంది.
భారత కరెన్సీలో ఇది సుమారు రూ.22.94 కోట్లకు సమానం.
ఇక క్యాబినెట్ మంత్రులకు వారి సీనియారిటీ, నిర్వహించే శాఖ ప్రాధాన్యతను బట్టి 1.80 మిలియన్ సింగపూర్ డాలర్ల నుంచి 2.88 మిలియన్ సింగపూర్ డాలర్ల వరకు వార్షిక వేతనం లభించనుంది.
అమెరికా అధ్యక్షుడి వార్షిక వేతనం 4,00,000 డాలర్లు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.3.7 కోట్లకు సమానం.
దీనితో పోలిస్తే సింగపూర్ ప్రధాని అందుకోబోయే రూ.27 కోట్ల వార్షిక వేతనం చాలా ఎక్కువ కావడం గమనార్హం.
వివరాలు
అధిక జీతాలతో ప్రతిభావంతులను ఆకర్షించొచ్చు..
రాజకీయ నాయకులకు అధిక వేతనాలు అందించడం వల్ల ప్రతిభావంతులు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ పార్లమెంటుకు తెలిపారు.
మంచి జీతాలు ఇవ్వడం ద్వారా సమర్థులైన నాయకులను ఆకర్షించడంతో పాటు దేశానికి మెరుగైన పాలన అందించవచ్చని పేర్కొన్నారు.
తన జీతం పెంపు మొత్తాన్ని విరాళంగా ఇస్తా..
తనకు లభించనున్న జీతం పెంపులో అదనంగా వచ్చే మొత్తాన్ని ప్రజలకు ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాల కోసం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు లారెన్స్ వాంగ్ తెలిపారు.
మంచి నాయకత్వంపైనే మంచి ప్రభుత్వం ఆధారపడి ఉంటుందనేది సింగపూర్ అనుసరిస్తున్న ప్రాథమిక సూత్రమని వివరించారు.
వివరాలు
అక్టోబర్ 15 నుంచి దశలవారీగా పెంపు
రాజకీయ నాయకుల వేతనాల్లో ప్రకటించిన పెంపు వెంటనే అమల్లోకి రాదని ప్రభుత్వం తెలిపింది.
నేతల పనితీరును పరిగణనలోకి తీసుకుని అక్టోబర్ 15 నుంచి వేతనాలను విడతల వారీగా పెంచనున్నట్లు వెల్లడించింది.
కాగా, సింగపూర్ ప్రపంచంలోనే అవినీతి తక్కువగా ఉన్న దేశాల్లో ఒకటిగా కొనసాగుతోంది.
అధిక వేతనాలు, సమర్థవంతమైన నాయకత్వం, సుపరిపాలన వంటి అంశాలకు ఆ దేశం ప్రాధాన్యం ఇస్తోంది.