PoK: పీఓకేలో లాంగ్ మార్చ్ ప్రారంభం.. పాక్ దళాలతో ఘర్షణలో 12 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
మరింత రాజకీయ ప్రాతినిధ్యంతో పాటు మొత్తం 38 డిమాండ్లను అమలు చేయాలని కోరుతూ జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) పిలుపునిచ్చిన లాంగ్ మార్చ్ బుధవారం ఆక్రమిత కశ్మీర్‌లో ప్రారంభమైంది. రావల్‌కోట్ నుంచి ముజఫరాబాద్ వరకు చేపట్టిన ఈ పాదయాత్రకు వేలాది మంది మద్దతు తెలిపారు. రావల్‌కోట్‌తో పాటు పలు పట్టణాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. ఉద్యమాన్ని అడ్డుకునేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం అడుగడుగునా భద్రతా బలగాలను మోహరించింది. లాంగ్ మార్చ్‌కు ముందు మంగళవారం నిరసనకారులు, భద్రతా సిబ్బంది మధ్య జరిగిన ఘర్షణల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితిని నియంత్రించేందుకు అదనంగా 4 వేల మంది పాక్ రేంజర్లను ప్రభుత్వం రంగంలోకి దింపింది.
వివరాలు
పీఓకే శాసనసభలో కాందిశీకులకు సీట్లు రిజర్వు
ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఉద్యమకారులు వెనక్కి తగ్గలేదు.
వేలాది మంది రావల్‌కోట్‌తో పాటు ఇతర పట్టణాల్లో గుమిగూడి ముజఫరాబాద్ వైపు తమ పాదయాత్రను ప్రారంభించారు.
రావల్‌కోట్‌లోని ఈద్గా మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో జేఏఏసీ నాయకుడు సర్దార్ అమన్ ఖాన్ మాట్లాడుతూ,దశాబ్దాలుగా పాకిస్థాన్ పాలకులు పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)ను'ఆజాద్ కశ్మీర్'గా పేర్కొంటున్నారని అన్నారు.
అయితే అది స్వతంత్ర ప్రాంతం కాదని,వివాదాస్పద ప్రాంతం కూడా కాదని,ఆక్రమిత ప్రాంతమేనని స్పష్టం చేశారు.
ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ పీఓకేలోని పలు పట్టణాల్లో నిరసనకారులు వేల సంఖ్యలో గుమిగూడినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి.
పీఓకే శాసనసభలో కాందిశీకులకు సీట్లు రిజర్వు చేయడాన్ని జేఏఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇదే ఈ ఉద్యమానికి ప్రధాన కారణంగా మారింది.