Khawaja Asif: పీఓకే నిరసనకారులు భారత్ వంటి శత్రువులే.. పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి భారత్‌ను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నవారిని భారత్‌తో సమానమైన శత్రువులుగా అభివర్ణించారు. అంతేకాదు, పీఓకేలో ఆందోళనకారులపై భద్రతా బలగాలు కాల్పులు జరపడం కూడా సమర్థించారు. స్థానిక టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసిఫ్ మాట్లాడుతూ.. "పీఓకేలో నిరసనలు చేస్తున్నవారికి, భారత్‌కు ఎలాంటి తేడా లేదు.వారితో చర్చలకు అవకాశం లేదు. వారు పాకిస్థాన్‌కు శత్రువులు" అని వ్యాఖ్యానించారు.
వివరాలు
పీఓకేలో ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలు
ఇదిలా ఉండగా, పీఓకేలో తొలి దశ శాసనసభ ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
నిషేధిత జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) కార్యకర్తలు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఆ సంస్థకు చెందిన 14 మంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ఈ ఘటనల్లో 24 మందికిపైగా గాయపడినట్లు కూడా జేఏఏసీ వెల్లడించింది.
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో శాసనసభ ఎన్నికల ప్రక్రియ సోమవారం ప్రారంభమై వచ్చే నెల 10వ తేదీ వరకు మూడు దశల్లో కొనసాగనుంది.
మొత్తం 45 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తొలి దశలో భాగంగా జులై 27న 13 స్థానాలకు పోలింగ్ జరిగింది.
వివరాలు
పీఓకే ఎన్నికల పై భారత్ స్పష్టమైన వైఖరిని
ఈ దశలో పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) తొమ్మిది స్థానాల్లో విజయం సాధించగా, మిగిలిన నాలుగు స్థానాల్లో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) గెలుపొందినట్లు అక్కడి ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఈ ఎన్నికలపై భారత్ ఇప్పటికే తన వైఖరిని స్పష్టం చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో కొనసాగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను ప్రపంచం దృష్టికి రాకుండా కప్పిపుచ్చేందుకు పాకిస్థాన్ చేస్తున్న కపట ప్రయత్నాల్లో భాగంగానే ఈ ఎన్నికలను నిర్వహిస్తోందని భారత్ విమర్శించింది.
అలాగే పాక్ ఆక్రమణలో ఉన్న ప్రాంతాలు ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని మరోసారి స్పష్టం చేసింది.