ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్.. 'శాంతిలో పాలుపంచుకోండి'
క్షిపణులతో విరుచుకుపడుతున్న రష్యాను ఉక్రెయిన్ ధీటుగా ఎదుర్కొంటోంది. ఒకవైపు యుద్ధం చేస్తూనే.. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉక్రెయిన్‌కు మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆ దేశ అధ్యక్షుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. ఈ క్రమంలోనే జెలెన్‌స్కీ.. ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. రష్యా దురాక్రమణ గురించి ప్రధాని మోదీకి జెలెన్‌స్కీ వివరించారు. రష్యాను నివారించేందుకు భారత్ చొరవ తీసుకోవాలని కోరారు. నూతన సంవత్సరంలో ప్రపంచ స్థిరత్వాన్ని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. ఐక్యరాజ్య సమితిలో మానవతా సహాయం, మద్దతు తెలిపినందుకు మోదీకి ఈ సందర్భంగా జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలిపారు.
ఇరు దేశాలు శతృత్వాన్ని తక్షణమే వీడాలి: మోదీ
జీ20 అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టిన నేపథ్యంలో మోదీకి జెలెన్‌స్కీ శుభాకాంక్షలు తెలిపారు. తాను ప్రతిపాదించిన శాంతిమంత్రం అమలులో భారత్ తన వంతు పాత్ర పోషించాలని చెప్పారు. ఉక్రెయిన్, రష్యా తమ శతృత్వాన్ని తక్షణమే వీడాలని ఈ సందర్భంగా జెలెన్‌స్కీకి మోదీ సూచించారు. విభేదాలకు శాశ్వత పరిష్కారాన్ని కనుక్కోవడానికి దౌత్య మార్గాన్ని అనుసరించాలన్నారు మోదీ. ఉక్రెయిన్-రష్యా ప్రారంభమైనప్పటి నుంచి.. ఇరు వర్గాలతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఇది యుద్ధాలకు యుగం కాదని స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనే మోదీ చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే.. రష్యా అణ్వస్త్రాలు ప్రయోగించకుండా నిలువరించడంలో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్.. ముఖ్య భూమిక పోషించినట్లు అమెరికా గూఢచర్య సంస్థ చెప్పగడం గమనార్హం.