ఆఫ్రికా దేశం నైజర్‌లో తిరుగుబాటు: అధ్యక్షుడిని తొలగించిన సైన్యం
నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆఫ్రికా దేశం 'నైజర్' అధ్యక్షుడు మొహమ్మద్ బజౌమ్ తన పదవిని కోల్పోయారు. అధ్యక్షుడిపై ఆ దేశ సైన్యం బుధవారం తిరిగుబాటు చేసింది. ఈ క్రమంలో అధ్యక్ష భవనంలో మొహమ్మద్ బజౌమ్‌ను కొన్ని గంటలపాటు నిర్భందించింది. అనంతరం అతడని అరెస్టు చేసిన సైన్యం, అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించినట్లు ఆ దేశ సైన్యం జాతీయ టెలివిజన్‌లో ప్రకటించింది. దేశంలో క్షీణిస్తున్న భద్రత, అవినీతి పాలన వల్లే తాము తిరుబాటు చేసినట్లు సైన్యం ప్రతినిధి కల్నల్ అమడౌ అబ్ద్రమానే ప్రకటించారు. నైజర్‌లో తిరుగుబాటు నేపథ్యంలో సరిహద్దులను మూసివేసారు. దేశవ్యాప్తంగా కర్ఫ్యూను విధించినట్లు అబ్ద్రమనే చెప్పారు. ఈ విషయంలో తాము విదేశీ జోక్యాన్ని ఆశించడం లేదని అబ్ద్రమనే పేర్కొన్నారు.
స్వాతంత్య్రం తర్వాత నైజర్‌లో నాలుగు తిరుగుబాట్లు
నైజర్‌లో సైనిక తిరుగుబాటులో ఆఫ్రికా ఉలిక్కిపడింది. 2020నుంచి పశ్చిమ, మధ్య ఆఫ్రికా ప్రాంతంలో ఇది ఏడో సైనిక తిరుగుబాటు కావడం గమనార్హం. 1960లో నైజర్ దేశం ఫ్రాన్స్ నుంచి స్వాతంత్ర్యం పొందింది. అప్పటి నుంచి ఈ దేశం ఫ్రాన్స్, అమెరికా, యూరప్ దేశాలకు మిత్రదేశంగా ఉంది. స్వాతంత్ర్యం అనంతరం దేశంలో నాలుగు సైనిక తిరుగుబాట్లు జరిగాయి. కాని అవి విఫలమయ్యాయి. కానీ మొదటిసారి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వంపై తిరుగుబాటు జరిగి అధికార మార్పిడి జరిగింది. నైజర్ భద్రత కోసం 2012 నుంచి అమెరికా ఇప్పటి వరకు 500 మిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. దేశం మిలిటరీని మెరుగుపరిచే లక్ష్యంతో మూడేళ్ల యూరోపియన్ మిలిటరీ మిషన్‌లో పాల్గొంటామని జర్మనీ ఏప్రిల్‌లో ప్రకటించింది.