
బ్రిటన్ రాజకుటంబంలో రచ్చ: కుక్క తినే ప్లేట్‌పైకి ప్రిన్స్ హ్యారీ ని తోసేసిన అన్న విలియం!
ఈ వార్తాకథనం ఏంటి
బ్రిటన్ రాజకుటుంబంలో జరిగిన మరో సంచలన విషయం బయటికి వచ్చింది. ప్రిన్స్ హ్యారీ, విలియం మధ్య జరిగిన ఘర్షణనను అంతర్జాతీయ మీడియా సంస్థ 'ది గార్డియన్' రాసుకొచ్చింది.
భార్య మేఘన్ కోసం రాజకుటుంబాన్ని వదిలి అమెరికాలో సాధారణ జీవితాన్ని గడుపుతున్న ప్రిన్స్ హారీ.. 'స్పేర్' పేరుతో తన ఆత్మకథను రాశారు. రాజకుటుంబంలో తనకు ఎదురైన అనుభవాలను అందులో పొందుపర్చారు. ఈ నెల 10న స్పేర్ విడుదల కానున్న నేపథ్యంలో అందులోని కీలక అంశాలను 'ది గార్డియన్' ప్రతిక రాసుకొచ్చింది.
అందులో తన అన్న విలియం.. తనపై భౌతికంగా దాడి చేసినట్లు, మేఘన్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు ఇద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగినట్లు ప్రిన్స్ హ్యారీ తన ఆత్మకథలో పేర్కొన్నట్లు 'ది గార్డియన్' వెల్లడించింది.
విలియం
ప్రిన్స్ హ్యారీ కాలర్‌ను పట్టుకొని నెట్టేశాడు
ప్రిన్స్ హ్యారీతో వాగ్వాదానికి దిగిన సమయంలో విలియం.. మేఘన్‌ను మొరటు మనిషి అంటూ సంబోధించినట్లు, అనంతరం ఇద్దరు భౌతిక దాడికి దిగినట్లు 'ది గార్డియన్' రాసుకొచ్చింది.
ప్రిన్స్ హ్యారీ కాలర్‌ను పట్టుకొని విలియం నెట్టివేశాడట. ఈ క్రమంలో హ్యారీ కుక్కకు అన్న పెట్టే ప్లేటుపై పడ్డాడట. అదే సమయంలో ఆ ప్లేటు పగిలి.. ముక్కలు హ్యారీ వీపుకు గుచ్చుకున్నట్లు 'ది గార్డియన్' చెప్పుకొచ్చింది. నొప్పితో బాధపడుతున్నా.. విలియం కనీసం తనను పైకి లేపలేదని ప్రిన్స్ బాధపడినట్లు వివరించింది.
ఈగొడవ విషయాన్నిమేఘన్‌తో పంచుకోవద్దని హ్యారీకి విలియం చెప్పాడట. అదే సమయంలో విలియం పశ్చాత్తాపపడి తనను క్షమాపణలు కూడా కోరినట్లు హ్యారీ తన ఆత్మకథలో రాసుకున్నట్లు 'ది గార్డియన్' రిపోర్టు చేసింది.