Hamza Burhan: పుల్వామా దాడి వెనుక కీలక పాత్ర.. హమ్జా బుర్హాన్ కాల్పుల్లో మృతి
ఈ వార్తాకథనం ఏంటి
పుల్వామా ఉగ్రదాడి కుట్రదారుల్లో కీలక వ్యక్తిగా గుర్తింపు పొందిన హమ్జా బుర్హాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో హతమయ్యాడు. పాకిస్థాన్ మద్దతుతో పనిచేస్తున్న అల్-బదర్ ఉగ్రవాద సంస్థలో కీలకంగా వ్యవహరించిన అతడు, పుల్వామా దాడి సమయంలో ఓవర్ గ్రౌండ్ వర్కర్ (OGW)గా కూడా పనిచేసినట్టు సమాచారం. 'డాక్టర్' అనే పేరుతో గుర్తింపు పొందిన హమ్జా బుర్హాన్‌పై ముజఫ్ఫరాబాద్‌లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో అతడికి పలుమార్లు తూటాలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు భద్రతా వర్గాలు వెల్లడించాయి. జమ్మూకాశ్మీర్‌లో అల్-బదర్ సంస్థ ప్రచారం, యువత నియామక కార్యకలాపాలకు అతడు ప్రధాన బలంగా ఉన్నాడని అధికారులు చెబుతున్నారు.
వివరాలు
యువతను ఉగ్రవాదంలోకి దింపిన వ్యక్తి..
స్థానిక యువతను ఉగ్రవాద సంస్థల్లో చేర్చేందుకు పోస్టర్లు, వీడియోలు, ఆన్‌లైన్ ప్రచార సామగ్రి తయారీలో హమ్జా కీలక పాత్ర పోషించాడు. అతడి అసలు పేరు అర్జుమంద్ గుల్జార్ దార్. పుల్వామాకు చెందిన అతడిని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 2022లో ఉగ్రవాదిగా ప్రకటించింది. హయ్యర్ స్టడీస్ పేరుతో 2017లో పాకిస్థాన్‌కు వెళ్లిన హమ్జా, అక్కడ కొద్ది కాలంలోనే నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్-బదర్‌లో చేరాడు. అనంతరం సంస్థలో వేగంగా ఎదిగి కమాండర్ స్థాయికి చేరుకున్నాడు. తర్వాత తిరిగి కాశ్మీర్‌కు వచ్చి యువతను తీవ్రవాద భావజాలం వైపు మళ్లించే కార్యకలాపాల్లో పాల్గొన్నట్టు సమాచారం. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా నుంచి షోపియన్ వరకు అతడి నెట్‌వర్క్ విస్తరించినట్టు భద్రతా సంస్థలు గుర్తించాయి.
వివరాలు
అత్యంత ఘోర దాడుల్లో ఒకటి..
ఇక 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడి భారత భద్రతా దళాలపై జరిగిన అత్యంత ఘోర దాడుల్లో ఒకటిగా నిలిచింది. జైష్-ఏ-మహ్మద్ (JeM)కు చెందిన ఉగ్రవాది పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని పుల్వామాలోని లేత్‌పొర వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ను ఢీకొట్టడంతో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘటన తర్వాత భారత వైమానిక దళం పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. దీంతో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.