Putin: మరణాన్ని జయించే దిశగా.. పుతిన్ యాంటీ ఏజింగ్ ప్రాజెక్ట్
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గత కొన్ని సంవత్సరాలుగా మానవ జీవిత కాలాన్ని పెంచడం, వృద్ధాప్యాన్ని నియంత్రించడం వంటి అంశాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం 73 ఏళ్ల వయసులో ఉన్న పుతిన్ మరింత కాలం చురుకుగా కొనసాగాలనే లక్ష్యంతో ఉన్నారని అంతర్జాతీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రష్యా ప్రభుత్వం 'యాంటీ ఏజింగ్' పేరుతో భారీ పరిశోధనా ప్రాజెక్టును ప్రారంభించింది. ఇందుకోసం సుమారు 26 బిలియన్ రూబుల్స్ నిధులు కేటాయించినట్లు సమాచారం.
వివరాలు
3డీ బయోప్రింటింగ్‌తో అవయవాల తయారీ
ఈ ప్రాజెక్టులో భాగంగా శాస్త్రవేత్తలు 3డీ బయోప్రింటింగ్ సాంకేతికతను ఉపయోగించి జీవకణాలను తయారు చేసి అభివృద్ధి చేయనున్నారు. అనంతరం ప్రత్యేకంగా పెంచే మినీ పిగ్స్‌లో మానవ అవయవాలను అభివృద్ధి చేసే దిశగా పరిశోధనలు కొనసాగించనున్నారు. భవిష్యత్తులో అవసరమైతే మనుషుల దెబ్బతిన్న లేదా పనిచేయని అవయవాలను వీటితో భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ విధానం ద్వారా మానవ జీవిత కాలాన్ని పెంచడంతో పాటు మరణాన్ని చాలా వరకు వాయిదా వేయవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వివరాలు
పుతిన్ కుమార్తె కీలక బాధ్యతలు
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు పుతిన్ కుమార్తె మరియా, ప్రముఖ శాస్త్రవేత్త మిఖాయిల్ కోవాల్చుక్ నాయకత్వం వహిస్తున్నారు. పరిశోధనలు విజయవంతమైతే మినీ పిగ్స్‌లో పెంచిన అవయవాలను మానవులకు మార్పిడి చేసే అవకాశాలు ఏర్పడతాయని కోవాల్చుక్ తెలిపారు. ఇది వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
వివరాలు
ప్రాజెక్టుపై సందేహాలు
అయితే ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై కొందరు శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రష్యాలో బయోప్రింటింగ్ వ్యవస్థ అభివృద్ధికి కీలక పాత్ర పోషించిన ప్రముఖ శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఓస్ట్రోవ్‌స్కీ ఈ ప్రాజెక్టుపై సందేహాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇది కేవలం ఆలోచనల స్థాయిలోనే ఉందని, పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చేందుకు ఇంకా అనేక శాస్త్రీయ సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.