Loading...
Russia: నాటోలో చిచ్చు పెట్టేందుకు పుతిన్ మాస్టర్ ప్లాన్.. అమెరికా హెచ్చరిక
నాటోలో చిచ్చు పెట్టేందుకు పుతిన్ మాస్టర్ ప్లాన్.. అమెరికా హెచ్చరిక

Russia: నాటోలో చిచ్చు పెట్టేందుకు పుతిన్ మాస్టర్ ప్లాన్.. అమెరికా హెచ్చరిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 08, 2026
04:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రానున్న కాలంలో నాటో కూటమిలోని ఏదో ఒక సభ్యదేశంపై దాడికి ప్రయత్నించే అవకాశం ఉందని అమెరికా నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి. నాటో కూటమి ఐక్యతను పరీక్షించేందుకే రష్యా ఇలాంటి చర్యకు పాల్పడే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నట్లు 'వాల్ స్ట్రీట్ జర్నల్' నివేదించింది. అయితే ఈ దాడి సంప్రదాయ యుద్ధ రూపంలోనే ఉండాల్సిన అవసరం లేదని అమెరికా నిఘా సంస్థలు పేర్కొంటున్నాయి. సైబర్ దాడులు, రహస్య ఆపరేషన్లు లేదా తూర్పు నాటో సరిహద్దుల్లో చిన్నస్థాయి సైనిక చొరబాటు వంటి రూపాల్లో రష్యా చర్యలకు దిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

వివరాలు

ఉక్రెయిన్ యుద్ధంతో మారిన అమెరికా అంచనాలు

ఇప్పటివరకు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో పూర్తిగా నిమగ్నమై ఉండటంతో.. నాటోతో నేరుగా తలపడేందుకు పుతిన్ వెనకాడతారని అమెరికా భావించింది.

అయితే రష్యాపై పెరుగుతున్న ఒత్తిడి, ఉక్రెయిన్ నుంచి జరుగుతున్న డ్రోన్ దాడులు, యుద్ధంలో రష్యా వెనకబడిపోతున్న పరిస్థితులు వంటి పరిణామాలతో అమెరికా అంచనాల్లో మార్పు వచ్చినట్లు నివేదిక వెల్లడించింది.

ఈ పరిణామాల నేపథ్యంలో పుతిన్ నాటోతో ఘర్షణకు దిగే ప్రమాదాన్ని అమెరికా నిఘా వర్గాలు ఇప్పుడు మరింత తీవ్రంగా పరిగణిస్తున్నాయి.

వివరాలు

నాటోను విచ్ఛిన్నం చేయడమే లక్ష్యమా?

అమెరికా అధికారుల అంచనా ప్రకారం.. నాటో సభ్యదేశాల భూభాగాలను ఆక్రమించుకోవడం రష్యా ప్రధాన లక్ష్యం కాదని తెలుస్తోంది.

బదులుగా నాటో దేశాల మధ్య విభేదాలను సృష్టించి, కూటమి ఐక్యతను దెబ్బతీయడమే పుతిన్ వ్యూహంగా ఉండొచ్చని వారు చెబుతున్నారు.

ఇప్పటికే పోలాండ్‌, రొమేనియా భూభాగాల్లోకి రష్యా క్షిపణులు వెళ్లడం, ఆయా దేశాల గగనతలంలోకి డ్రోన్లు ప్రవేశించడం వంటి ఘటనలను అమెరికా నిఘా వర్గాలు హెచ్చరిక సంకేతాలుగా పరిగణిస్తున్నాయి.

ఈ ఏడాది నుంచి 2029 మధ్య రష్యా ఇలాంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉందని అమెరికన్ నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ADVERTISEMENT

వివరాలు

ఆర్టికల్-5ను అమలు చేసేంత దాడి ఉండకపోవచ్చు

అయితే రష్యా నేరుగా నాటో భూభాగంపై పెద్దస్థాయి సైనిక దాడి చేసే అవకాశం మాత్రం తక్కువగా ఉందని అమెరికా భావిస్తోంది. ఎందుకంటే అలాంటి దాడి జరిగితే నాటోలోని ఆర్టికల్-5ను అమలు చేసే పరిస్థితి ఏర్పడవచ్చు.

ఆర్టికల్-5 ప్రకారం.. నాటోలోని ఏ ఒక్క సభ్యదేశంపై దాడి జరిగినా, దాన్ని మొత్తం కూటమిపై జరిగిన దాడిగా పరిగణిస్తారు.

అప్పుడు రష్యాపై ప్రతిచర్యలకు నాటోలోని అన్ని సభ్యదేశాలు ఏకమయ్యే అవకాశం ఉంటుంది.

అందుకే ఆర్టికల్-5 అమలయ్యే స్థాయికి చేరుకోని విధంగా పరిమిత చర్యలకు రష్యా పాల్పడే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నాయి.

దీనికి 2007లో ఎస్టోనియాపై జరిగిన రష్యా సైబర్ దాడులను ఉదాహరణగా చూపుతున్నాయి.

ADVERTISEMENT