Kanishka Narayan: బీహార్ యువకుడికి బ్రిటన్‌లో అరుదైన గౌరవం.. తొలి AI మంత్రిగా కనిష్క నారాయణ్!
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ సంతతికి చెందిన కనిష్క నారాయణ్ బ్రిటన్‌లో చరిత్ర సృష్టించారు. కృత్రిమ మేధ (AI) రంగానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్రిటన్ తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) శాఖకు తొలి మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. బీహార్‌లో జన్మించిన కనిష్కకు ఈ కీలక పదవి దక్కడంతో భారతీయ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కనిష్క నారాయణ్ బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో జన్మించారు. ఆయనకు 12 ఏళ్లు ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి బ్రిటన్‌లోని కార్డిఫ్ నగరానికి వలస వెళ్లారు. అక్కడే ఉన్నత విద్యను అభ్యసించి రాజకీయాల్లో అడుగుపెట్టారు. బ్రిటన్ ప్రభుత్వం తొలిసారిగా ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయగా, ఆ శాఖకు కనిష్క నారాయణ్‌ను ఎంపిక చేసింది.
వివరాలు
విద్యలోనూ అత్యుత్తమ ప్రతిభ
ఆయన నియామకాన్ని గూగుల్ డీప్‌మైండ్ సీఈఓ, ఏఐ రంగ ప్రముఖుడు డెమిస్ హస్సాబిస్ స్వాగతించారు.
సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా కనిష్కకు అభినందనలు తెలియజేస్తూ ప్రశంసలు కురిపించారు.
చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరిచిన కనిష్క నారాయణ్.. ప్రతిష్ఠాత్మక ఈటన్ కాలేజీలో స్కాలర్‌షిప్‌పై విద్యాభ్యాసం చేశారు.
అనంతరం ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ (PPE) విభాగాల్లో అండర్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేశారు.
ఆ తర్వాత అమెరికాలోని ప్రముఖ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేశారు.
వివరాలు
రాజకీయ ప్రస్థానం ఇలా..
వలస కుటుంబానికి చెందిన వ్యక్తిగా ప్రజాసేవపై ఆసక్తి పెంచుకున్న కనిష్క లేబర్ పార్టీలో చేరారు.
వేల్స్‌లోని గ్లామోర్గన్ నియోజకవర్గం నుంచి 2022లో పార్లమెంటరీ రాజకీయాల్లో అడుగుపెట్టారు. అదే ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా కొనసాగారు.
తర్వాత ప్రధాని కీర్ స్టార్మర్ ప్రభుత్వంలో సైన్స్, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ శాఖలో పార్లమెంటరీ సెక్రటరీగా పనిచేశారు. తాజాగా ఆయనకు పదోన్నతి లభించగా, బ్రిటన్ తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మంత్రిగా నియమిస్తూ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.
ఈ నియామకం బ్రిటన్ టెక్నాలజీ రంగంలోనే కాకుండా భారతీయ సంతతికి కూడా గర్వకారణంగా నిలిచింది.