Nepal Bus Accident: నదిలో కొట్టుకుపోయిన రెండు బస్సులు.. ఏడుగురు భారతీయులతో సహా 50 మందికి పైగా గల్లంతు
నేపాల్‌లో కొండచరియలు విరిగిపడి శుక్రవారం తెల్లవారుజామున రెండు బస్సులు నదిలో కొట్టుకుపోవడంతో ఏడుగురు భారతీయ పౌరులతో సహా 60 మందికి పైగా ప్రయాణికులు గల్లంతయ్యారు. అధికారులు, మీడియా కథనాల ద్వారా ఈ సమాచారం అందింది. చిత్వాన్ జిల్లాలోని సిమల్తాల్ ప్రాంతంలోని నారాయణఘాట్-ముగ్లింగ్ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో 65 మంది ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు త్రిశూలి నదిలో కొట్టుకుపోయాయని అధికారులను ఉటంకిస్తూ న్యూస్ పోర్టల్ 'మై రిపబ్లికా' తెలిపింది. చిత్వాన్ చీఫ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఇంద్రదేవ్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో రాజధాని నుంచి గౌర్ వెళ్తున్న గణపతి డీలక్స్ బస్సు, ఖాట్మండు వెళ్తున్న ఏంజెల్ డీలక్స్ బస్సు ప్రమాదానికి గురయ్యాయి.
ఖాట్మండు నుంచి రౌతాహట్‌కు బస్సు
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, 41 మంది ప్రయాణికులతో ఖాట్మండు నుంచి రౌతాహట్‌కు గణపతి డీలక్స్ బస్సు వెళ్తోంది. ఏంజెల్ డీలక్స్‌కు చెందిన రెండవ బస్సు బిర్‌గంజ్ నుండి ఖాట్మండుకు వెళ్తుండగా అందులో దాదాపు 24 మంది ప్రయాణికులు ఉన్నారు. 'ఖాట్మండు పోస్ట్' వార్తాపత్రిక కథనం ప్రకారం, గణపతి డీలక్స్ బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు వాహనం నుండి దూకి తప్పించుకోగలిగారు. బిర్‌గంజ్ నుంచి ఖాట్మండు వెళ్తున్న ఏంజెల్ బస్సులో ప్రయాణిస్తున్న 21 మంది ప్రయాణికుల వివరాలు లభ్యమయ్యాయని, అందులో ఏడుగురు భారతీయులు ఉన్నట్లు వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు.
భద్రతా దళాల సిబ్బందితో సహాయక చర్యలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండచరియలు విరిగిపడి గల్లంతైన భారతీయ ప్రయాణికుల్లో ఆరుగురిని సంతోష్ ఠాకూర్, సురేంద్ర షా, ఆదిత్ మియాన్, సునీల్, షానవాజ్ ఆలం, అన్సారీగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఏడవ భారతీయుడు ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అధికారుల ప్రకారం, 75 మందికి పైగా భద్రతా దళాల సిబ్బందితో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, అయితే భారీ వర్షాలు, త్రిశూలి నది నీటి మట్టం పెరగడం సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తోంది. నేపాలీ ఆర్మీ, సాయుధ పోలీసు బలగాలకు చెందిన డైవింగ్ బృందం బస్సుల కోసం వెతుకుతోంది, అయితే వారికి ఇంకా వాహనాలు దొరకలేదు.