LOADING...
F-16: ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని కూల్చేశాం.. ప్రకటించిన రష్యా 
ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని కూల్చేశాం.. ప్రకటించిన రష్యా

F-16: ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని కూల్చేశాం.. ప్రకటించిన రష్యా 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 12, 2026
05:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా తయారీ ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని తాము కూల్చివేశామని రష్యా సైనిక కమాండర్ ప్రకటించారు. ఉక్రెయిన్ గగనతలంలో ఆ యుద్ధ విమానం ధ్వంసమైందని వెల్లడించారు. ఎస్-300 ఎయిర్ డిఫెన్స్ బ్యాటరీ ద్వారా ఈ ఆపరేషన్ నిర్వహించామని తెలిపారు. రష్యా 1 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను కమాండర్ స్పష్టం చేశారు. అమెరికా సరఫరా చేసిన ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని తమ దళాలు కూల్చడం చాలా అరుదైన ఘటన అని ఆయన పేర్కొన్నారు. ఎస్-300 బ్యాటరీ నుంచి రెండు క్షిపణులను ప్రయోగించామని చెప్పారు. తొలి క్షిపణి విమానాన్ని దెబ్బతీయగా, రెండో క్షిపణి తాకడంతో అది పూర్తిగా ధ్వంసమై నేలకూలిందని వివరించారు.

వివరాలు 

ఇప్పటివరకు నాలుగు ఎఫ్‌-16 యుద్ధ విమానాలు నేలకూలాయి 

ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు తమకు చాలా సమయం పట్టిందని కమాండర్ తెలిపారు. ఆ యుద్ధ విమానాన్ని ముందుగా ట్రాక్ చేశామని, అయితే దాన్ని కూల్చడం అసాధ్యమైన పని కాదని తర్వాత తెలిసిందన్నారు. అయితే ఈ దాడి ఎప్పుడు జరిగిందన్న తేదీని మాత్రం ఆయన వెల్లడించలేదు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2024 ఆగస్టు నెలలో ఉక్రెయిన్‌కు ఎఫ్‌-16 యుద్ధ విమానాలు అందాయి. ఈ యుద్ధంలో ఇప్పటివరకు నాలుగు ఎఫ్‌-16 యుద్ధ విమానాలు నేలకూలినట్లు సమాచారం. యూరోపియన్ దేశాల మద్దతుతో ఉక్రెయిన్‌కు ఈ యుద్ధ విమానాలు అందుతున్నాయి. మొత్తం 87 జెట్ల అవసరానికి గాను ఇప్పటివరకు 44 ఎఫ్‌-16 యుద్ధ విమానాలు ఉక్రెయిన్‌కు చేరినట్లు తెలుస్తోంది.

Advertisement