Oreshnik missile: కీవ్‌పై రష్యా భారీ దాడి.. 'ఒరెష్నిక్' హైపర్‌సోనిక్ క్షిపణి ప్రయోగం
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా మరోసారి కీవ్ ప్రాంతంపై భారీ దాడికి దిగింది. డ్రోన్లు, క్షిపణులతో ఆదివారం ఉదయం నిర్వహించిన ఈ దాడిలో కీవ్ రీజియన్‌లోని బిలా సెర్క్వా నగరం తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దాడి ప్రభావంతో ప్రభుత్వ కార్యాలయాలు, నివాస భవనాలు, పాఠశాలలు భారీ నష్టాన్ని చవిచూశాయి. గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధంలో రష్యా ఈ ప్రత్యేక ఆయుధాన్ని వినియోగించడం ఇది మూడోసారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఘటనపై వోలోడిమిర్ జెలెన్స్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని రష్యా భారీ స్థాయిలో డ్రోన్, క్షిపణి దాడులు నిర్వహిస్తోందని ఆరోపించారు.
వివరాలు
ఏమిటీ 'ఒరెష్నిక్' క్షిపణి?
ముఖ్యంగా శక్తివంతమైన హైపర్‌సోనిక్ 'ఒరెష్నిక్' క్షిపణులను ప్రయోగిస్తోందని పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటివరకు రష్యా అధికారికంగా స్పందించలేదు. 'ఒరెష్నిక్' అనేది రష్యా అభివృద్ధి చేసిన అత్యాధునిక హైపర్‌సోనిక్ బాలిస్టిక్ క్షిపణుల్లో ఒకటి. ఇది గంటకు సుమారు 13,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని సమాచారం. అంటే ధ్వని వేగం కంటే దాదాపు 10 రెట్లు వేగంగా దూసుకెళ్తుంది. ఈ క్షిపణి అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది. ఈ క్షిపణి పరిధిలో యూరప్‌లోని అన్ని దేశాలు వస్తాయని, దీన్ని అడ్డుకునే సామర్థ్యం ఉన్న రక్షణ వ్యవస్థ ప్రస్తుతం లేదని రష్యా గతంలో ప్రకటించింది.
వివరాలు
మూడోసారి దాడి
రష్యా తొలిసారిగా ఈ 'ఒరెష్నిక్' క్షిపణిని 2024 నవంబరులో Dnipro నగరంలోని ఓ ఫ్యాక్టరీపై ప్రయోగించింది. అప్పట్లో ఇది అభివృద్ధి దశలోనే ఉన్నట్లు సమాచారం. అనంతరం దీనిని పూర్తిస్థాయిలో సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఉక్రెయిన్‌లోని పశ్చిమ ప్రాంతమైన లీవ్‌పై రెండోసారి ఈ క్షిపణిని ఉపయోగించిన రష్యా.. ఇప్పుడు కీవ్ రీజియన్‌పై మూడోసారి ప్రయోగించింది.