Russia: పాత దోస్తీకి కొత్త పరీక్ష.. భారత్ సాయం కోరిన రష్యా
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశాల్లో ఒకటైన రష్యా.. ఇప్పుడు శుద్ధి చేసిన ఇంధనం కోసం భారత్‌పై ఆధారపడే పరిస్థితి కనిపిస్తోంది. ఉక్రెయిన్ దాడుల కారణంగా రష్యాలోని కీలక చమురు శుద్ధి కేంద్రాలు దెబ్బతినడంతో దేశంలో పెట్రోల్ సరఫరాపై ఒత్తిడి పెరిగింది. దీంతో అదనపు పెట్రోల్ సరఫరా కోసం భారతీయ రిఫైనరీలను రష్యా సంప్రదించినట్లు సమాచారం. ఈ పరిణామం అంతర్జాతీయ ఇంధన రంగంలో ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు ప్రపంచ దేశాలకు ముడి చమురును సరఫరా చేసే ప్రధాన దేశంగా ఉన్న రష్యా.. ఇప్పుడు అదే చమురును శుద్ధి చేసిన పెట్రోల్ రూపంలో భారత్ నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఎదుర్కొంటోంది.
వివరాలు
కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ కొరతతో ఒత్తిడి..
భారత్‌కు భారీగా క్రూడ్ ఆయిల్ ఎగుమతి చేసిన రష్యా.. ఇప్పుడు భారత రిఫైనరీల వైపు చూడటం ప్రాధాన్యం సంతరించుకుంది.
దీనికి ప్రధాన కారణం ఉక్రెయిన్ చేపడుతున్న డ్రోన్ దాడులే. రష్యాలోని చమురు రిఫైనరీలు, ఇంధన నిల్వ కేంద్రాలపై వరుసగా దాడులు జరగడంతో కొన్ని ప్రాంతాల్లో ఇంధన ఉత్పత్తి తగ్గినట్లు సమాచారం.
రిఫైనరీల్లో మరమ్మతులు కొనసాగుతుండటం, ఉత్పత్తికి అంతరాయం ఏర్పడటం వల్ల దేశీయ మార్కెట్‌లో పెట్రోల్ సరఫరాను సాధారణ స్థితిలో ఉంచడం రష్యాకు సవాల్‌గా మారింది.
దీంతో దేశీయ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ ఇంధన సరఫరాను నియంత్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ కొరత ఒత్తిడి పెరగడంతో దిగుమతుల ద్వారా లోటును భర్తీ చేసే అవకాశాలను మాస్కో పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
రష్యాకు చెందిన సంస్థలు భారతీయ రిఫైనరీ కంపెనీలతో సంప్రదింపులు..
ఈ నేపథ్యంలో రష్యాకు చెందిన సంస్థలు భారతీయ రిఫైనరీ కంపెనీలతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.
ప్రపంచ స్థాయిలో భారీ చమురు శుద్ధి సామర్థ్యం కలిగిన దేశాల్లో భారత్ ఒకటి. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురును శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్‌తో పాటు ఇతర ఇంధన ఉత్పత్తులుగా మార్చి అంతర్జాతీయ మార్కెట్లకు కూడా భారత్ ఎగుమతి చేస్తోంది.
ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. గత కొన్నేళ్లుగా భారత్ రష్యా నుంచి రికార్డు స్థాయిలో ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది.
ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాల ఆంక్షలతో రష్యా తన చమురుకు కొత్త మార్కెట్లను వెతకాల్సి వచ్చింది.